తుక్కుగూడ బహిరంగ సభలో సోనియాగాంధి ప్రకటించిన 6 గ్యారెంటీ స్కీముల తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందట. తెలంగాణా ఇన్టెన్షన్స్ అనే సంస్ధ ప్రతి వారం వీక్లీ ట్రాకర్ పేరుతో జనాల మూడ్ ను ప్రకటిస్తుంటుంది. ప్రజల్లో పార్టీలపై ఆదరణ పెరుగుతోందా లేకపోతే తగ్గుతోందా ? అనే విషయమై సర్వే జరిపి ప్రతివారం ప్రకటిస్తుంటుంది. ఈ వారంలో చేసిన సర్వేలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని తేలింది. కారణం ఏమిటంటే 6 గ్యారెంటీస్ అనే సమాధానం వినిపిస్తోంది.
వివిధ కారణాల వల్ల గడచిన 45 రోజులుగా కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ ను మెల్లిగా పెంచుకుంటోంది. 6 గ్యారెంటీస్ ప్రకటన తర్వాత జనాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ 2.8 శాతం పెరిగినట్లు సమాచారం. పదిరోజుల క్రితం హస్తం పార్టీ గ్రాఫ్ 30.3 శాతం ఉంటే ఇపుడా గ్రాఫ్ 33.1 శాతంకు చేరుకుంది. సోనియా ప్రకటించిన 6 హామీలు జనాలకు ఉపయోగపడేవే అని జనాలు చెప్పుకుంటున్నారు. 6 హామీలు రాబోయే పోలింగులో కాంగ్రెస్ పై ప్రభావం చూపుతుందని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా కాస్త పెరిగినా కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెరుగుతుండటంతో రెండు పార్టీల మధ్య అంతరం తగ్గుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి తప్పకుండా వస్తుందని 37 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అయితే హామీలు వినడానికి బాగానే ఉన్నా అమలు సాధ్యం కాదని 38 శాతం అభిప్రాయపడ్డారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనాల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉంది. అయితే నేతల్లో ఉందా అన్నది పాయింట్. ఎందుకంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేతలు ఎప్పుడూ గొడవలు పడుతునే ఉంటారు. పార్టీకన్నా సొంత ఇమేజే ముఖ్యమని ఫీలయ్యే నేతలు ఎక్కువైపోవటంతోనే సమస్య పెరిగిపోతోంది. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నకారణంగా రాబోయే ఎన్నికల్లో అయినా అందరు ఏకతాటిపైకి చేరుకుని పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచన చాలామందిలో కనిపించటంలేదు. ప్రతి చిన్న విషయానికి ఏదో కారణంతో గొడవలు పడేవాళ్ళు, అలిగే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకనే జనాలకు కాంగ్రెస్ అంటే విరక్తి పెరిగిపోతోంది.