దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మహిళనైన తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరపడాన్ని కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈడీ తీరును తప్పుబట్టిన కవిత అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసు ట్యాగ్ చేసి తన విచారణ కొనసాగించాలని కోరారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా సమన్లు జారీ చేయడం తగదని, నళిని చిదంబరానికి ఇచ్చినట్లుగానే తనకు కూడా వెసులుబాటు ఇవ్వాలని కోరారు.
ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు స్వల్ప ఊరటనిచ్చింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. అయితే, అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా కవితపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళను విచారణకు పిలవకూడదంటే ఎలా అని ప్రశ్నించింది. కాకపోతే మహిళల విచారణ సమయంలో రక్షణ ఉండాలని అభిప్రాయపడింది. అన్నిటికీ ఒకే ఆర్డర్ ను అప్లై చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తుది నిర్ణయం వచ్చేంతవరకు కవితకు సమన్లు జారీ చేయబోమని ఈడీ వెల్లడించింది.
మరోవైపు, గవర్నర్ తమిళసై తీరుపై కవిత విమర్శలు గుప్పించారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా తమిళిసై వ్యవహరిస్తున్నారని, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను తిరస్కరించడం సరికాదని అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారన్న విషయాన్ని తమిళిసై గుర్తుంచుకోవాలని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates