ఈ కాంగ్రెస్ సీనియర్లకు మొండిచెయ్యే?

వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సానుకూల పవనాలను వాడుకుని.. వచ్చే ఎన్నికల్లో నెగ్గేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో కొంతమంది సీనియర్ నేతలను తప్పించే అవకాశముందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ల స్థానంలో క్యాడర్ లో బలంగా ఉన్న నాయకులకు అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీలోని కొంతమంది సభ్యులు చెప్పారని తెలిసింది. కానీ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటే రమేశ్ రెడ్డికి టికెట్ కేటాయించడమే సరైందని మరికొంతమంది సభ్యులు అంటున్నారని సమాచారం. 2018 ఎన్నికల్లో దామోదర్ రెడ్డి పోటీ చేశారు. అప్పుడు నల్గొండ ఎంపీగా రమేశ్ రెడ్డిని నిలబెడతామని పార్టీ హామీనిచ్చింది. కానీ 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ పోటీ చేసి గెలిచారు. దీంతో ఈ సారి రమేశ్ రెడ్డికి కచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్లో చర్చ సాగుతోంది. పైగా దామోదర్ వరుసగా రెండు సార్లు ఓడిపోయారనే అంశం రమేశ్ రెడ్డికి కలిసొచ్చేలా ఉంది.

మరోవైపు జనగామలో వరుస ఓటముల కారణంగా పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా వయసు కూడా మీద పడటంతో ఆయన స్థానంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరో పరిస్థితి ఉంది. ఇక్కడ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సురేందర్ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. 2019లో జహీరాబాద్ ఎంపీ టికెట్ సుభాష్ రెడ్డికి ఇస్తామని కాంగ్రెస్ మాటిచ్చింది. కానీ ఆ స్థానంలో మదన్ మోహన్ పోటి చేసి ఓడిపోయారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కోసం సుభాష్ రెడ్డి సిద్ధమవుతుండగా.. మదన్ మోహన్ కూడా టికెట్ అడుగుతున్నారు. ఈ ఇద్దరు నాయకులు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది.