టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కింకర్తవ్యం ఏమిటీ? చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయన ఎటువంటి అడుగులు వేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తండ్రి చంద్రబాబు రిమాండ్ మీద జైలుకు వెళ్లిన తర్వాత లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే విషయాన్ని జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మార్చేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ చంద్రబాబు అరెస్టు విషయాన్ని చర్చనీయాంశంగా మార్చేలా తమ ఎంపీలను నడిపించారు.
మరోవైపు జాతీయ స్థాయి నేతలను కలుస్తూ మద్దతు కూడగట్టేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు బాబుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయాలంటే 17ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలని, సీఐడీ అలా చేయనందున ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారని తెలిసింది. ఢిల్లీలోనే మరికొన్ని రోజులు ఉండి ఈ కేసు విషయం తేల్చుకోవాలని చూస్తున్నారు. అందుకు అనుగుణంగా సుప్రీం కోర్టు న్యాయవాదులను ఆయన కలుస్తున్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వరుసగా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయనే చెప్పాలి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి బాబుకు ఏదీ కలిసి రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట రిమాండ్ రిపోర్ట్ను కొట్టివేయాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తే లాభం లేకుండా పోయింది. బాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన బాబు.. హైకోర్టును ఆశ్రయిస్తూ క్వాష్ పిటిషన్ వేశారు. కానీ దీన్ని కోర్టు కొట్టేసింది. మరోవైపు బాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.