అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది… అయితే ఈ ఆధునిక సమాజంలో అన్ని దానాలలో కెల్లా అవయవ దానం కూడా గొప్పదే అన్న నానుడి బాగా ప్రాచుర్యం పొందింది. అనారోగ్య కారణాలతో, రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారు, బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు నిర్ధారించిన వారు తమ అవయవాలను దానం చేసి ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపిన ఘటనలు అనేకం ఉన్నాయి. అవయవదానంపై సెలబ్రిటీలు, సినీ తారలు, క్రీడాకారులు ప్రచారం చేపట్టడంతో ప్రజల్లో కాస్త అవగాహన పెరిగింది. అయినప్పటికీ, భారత దేశంలోని సంప్రదాయాల, మత ఆచారాల వల్ల చాలామంది అవయవదానంపై ఆసక్తి చూపడం లేదు.

ఈ నేపథ్యంలోనే అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమిళనాడులో అవయవ దానం చేసిన వారి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని స్టాలిన్ ప్రకటించారు. అవయవ దానం చేసే విషయంలో దేశంలోనే తమిళనాడు రెండో స్థానంలో ఉందని స్టాలిన్ అన్నారు. వందలాదిమందికి అవయదానం వల్ల కొత్త జీవితాలు వస్తున్నాయని స్టాలిన్ చెప్పారు. అయితే, నిస్వార్ధంగా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన వారి వల్లే తమిళనాడుకు ఈ ఘనత దక్కిందని స్టాలిన్ కొనియాడారు.

తమ ఆత్మీయులు చనిపోయిన పరిస్థితుల్లో కూడా అవయవదానానికి ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులకు స్టాలిన్ ధన్యవాదాలు చెప్పారు. అందుకే, అవయవదానం చేసిన వారి త్యాగాన్ని గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 2022 సంవత్సరానికి గాను దేశంలో అత్యధిక అవయవదానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం 2022లో తెలంగాణలో 194 అవయవ దానాలు జరిగాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో 154 అవయవ దానాలతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏదేమైనా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎందరికో ఆదర్శప్రాయమని, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శప్రాయమని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.