చంద్రబాబుకు షాక్..2 రోజుల కస్టడీ

Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ 2 రోజుల పాటు చంద్రబాబును విచారణ జరిపేందుకు సీఐడీ అధికారులకు అనుమతిచ్చింది. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబును రేపు, ఎల్లుండి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. అంతేకాదు, విచారణ పూర్తయిన తర్వాత చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని సీఐడీ అధికారులను ఆదేశించారు.

సీఐడీ మూడు రోజుల కస్టడీ కోరగా..2 రోజుల తీవ్ర ఉత్కంఠ తర్వాత 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. చంద్రబాబును ఎక్కడ విచారణ జరుపుతారని సీఐడీ తరపు న్యాయవాదులను న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే, రాజమండ్రి జైలులోనే విచారణ జరుపుతామని సీఐడీ అధికారులు చెప్పారు. దీంతో, ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేందుకు కోర్టు అనుమతిచ్చింది. విచారణపై సీల్డ్ కవర్‌లో నివేదికలో ఇవ్వాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణ అధికారుల జాబితా, విచారణకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రాకూడదని ఆదేశించింది.

మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో కూడా చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.