దసరా పండుగ నుండి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం మారబోతున్న విషయం తెలిసిందే. రాబోయే దసరా పండుగను తాను వైజాగ్ లోనే చేసుకోబోతున్నట్లు స్వయంగా జగనే మంత్రివర్గ సహచరులతో చెప్పారు. ఇదే విషయమై మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ అక్టోబర్ 23వ తేదీనుండి జగన్ వైజాగ్ లోనే ఉంటారని ప్రకటించారు. స్వయంగా తాను వైజాగ్ కు మారబోతున్నట్లు జగనే ప్రకటించారు కాబట్టి ఉన్నతాధికారులు కూడా ఈ దిశగా పనుల్లో స్పీడు పెంచారు.
ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు కార్యాలయం, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, నివాసాలు, అవసరమైన సిబ్బంది క్వార్టర్స్ తదితరాల ఏర్పాట్లలో చాలా బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వారంలో రెండు రోజులు జగన్ వైజాగ్ లో ఉండబోతున్నట్లు తెలిసింది. అదికూడా గురు, శుక్ర వారాల్లో విశాఖపట్నంలో ఉంటారని మిగిలిన రోజుల్లో అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటనలు చేయబోతున్నట్లు సమాచారం.
జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టుకు టెక్నికల్ గా న్యాయస్థానం నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టులో ను తర్వాత సుప్రింకోర్టులోను చాలా కేసులున్నాయి. వీటి విచారణ కూడా నత్తనడక నడుస్తున్నాయి. దాంతో రాబోయే ఎన్నికల్లోపు తన ఆపీసును వైజాగ్ కు తీసుకెళ్ళిపోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. మూడు రాజధానులు అంటే సాంకేతిక కారణాలు అడ్డువస్తాయి. అదే ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసంటే ఏ టెక్నికల్ సమస్యా అడ్డురాదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్ ఎక్కడినుండైనా పరిపాలన చేయవచ్చు.
ముఖ్యమంత్రి హోదాలో పలానా చోటే కూర్చోవాలని ఏ కోర్టు కూడా చెప్పలేదు. అందుకనే ముందుగా తాను వైజాగ్ కి మారిపోతే తర్వాత విషయాలను తర్వాత చూసుకోవచ్చని జగన్ అనుకున్నట్లున్నారు. జగన్ ఎక్కడుంటే అదే రాజధాని అన్నట్లుగా వైసీపీ కలరింగ్ ఇస్తోంది. కాబట్టి అనధికారికంగా విశాఖపట్నమే రాజధాని అన్న ప్రచారం పెరిగిపోతోంది. వచ్చేఎన్నికల్లోగా వైజాగ్ ను రాజధాని అని అనిపించుకోవాలన్నది జగన్ ఉద్దేశ్యం. అందుకు తగ్గట్లే అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి ముహూర్తం నాటికి ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates