దశాబ్దాలుగా చట్టసభలో నాని.. ఎంతకూ చట్టంగా మారని మహిళా బిల్లుకు మోక్షం కలుగనుంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లు వాయు వేగంతో ముందుకు వెళుతోంది. బుధవారం లోక్ సభ ఓకే చేయగా.. గురువారం పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభ తన ఆమోదాన్ని తెలిపింది. లోక్ సభలో ఇద్దరు సభ్యులు మినహా మిగిలిన వారంతా మహిళా బిల్లుకు తమ మద్దతు తెలిపితే.. రాజ్యసభలోని 215 మంది సభ్యులంతా ఈ బిల్లుకు తమ ఆమోదాన్ని తెలియజేశారు. ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఓటేయలేదు. సభ్యులంతా ఏకగ్రీవంగా తమ ఆమోదాన్ని తెలిపినప్పటికీ.. నిబంధనల ప్రకారం ఓటింగ్ నిర్వహించారు.
అనంతరం మహిళా బిల్లు 2/3 వంతు సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లుగా సభాపతి జగదీప్ ధన్ ఖడ్ ప్రకటించారు. మొత్తం 11 గంటల పాటు సాగిన చర్చలో సభలోని పలు పార్టీల నేతలు మాట్లాడారు. గురువారం రాత్రి 10.30 గంటల వేళలో మహిళా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినట్లుగా ప్రకటించారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ సభలోనే ఉన్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మహిళా బిల్లును ప్రవేశ పెట్టిన మోడీ సర్కారు తీరును పలువురు సభ్యులు ‘ఎన్నికల గిమ్మిక్కు’గా పేర్కొన్నప్పటికీ ఓటింగ్ సమయంలో మాత్రం బిల్లుకు తమ మద్దతును తెలిపారు. బిల్లుకు సభ ఆమోదం తెలిపిన అనంతరం ఒక రోజు ముందుగానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. రోజు తేడాతో రెండు సభలు మహిళా బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అది జరిగిన వెంటనే చట్టంగా మారుతుంది.
2024 ఎన్నికల తర్వాత జన గణన.. డీ లిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఈ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఈ బిల్లుపై లోక్ సభలో చర్చ జరిగిన సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ బిల్లు చట్టం రూపంలోకి వచ్చినప్పటికీ.. ఎన్నికల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ అన్నది 2029 ఎన్నికల తర్వాత మాత్రమే అమల్లోకి రానుంది. ఈ బిల్లులోని క్లాజ్ 5పై విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్ కసరత్తు అయ్యే వరకు బిల్లు అమల్లోకి రాదని చెప్పటం విచారకరమని పేర్కొన్నారు.
ఏమైనా.. ఇన్నాళ్లు ఉభయ సభలు దాటని మహిళా బిల్లు.. ఎట్టకేలకు చట్టసభల అభ్యంతరాల నుంచి బయట పడిన నేపథ్యంలో రానున్న రోజుల్లో చట్టసభలకు జరిగే ఎన్నికల్లో 33 శాతం మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారని చెప్పకతప్పదు. కొసమెరుపు ఏమంటే.. వాట్సాప్ యూనివర్సిటీలో తయారైన ఒక పోస్టు అందరినీ ఆకర్షిస్తోంది. 2029 తర్వాత కానీ అమల్లోకి రాని మహిళా రిజర్వేషన్లు.. 2024 ఎన్నికల సమయంలో మోడీ సర్కారుకు మేలు చేయటం చూస్తే.. నమోనా? మజాకానా? అనుకోకుండా ఉండలేం.
Gulte Telugu Telugu Political and Movie News Updates