కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ చేస్తోందని.. అయితే.. ఎంఐఎంను నమ్మితే.. ఏ పార్టీ కూడా.. బతికి బట్టకట్టిన పాపాన పోలేదని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా.. ఎంఐఎంతో చెలిమి చేసి చేతులు కాల్చుకుందని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా అసెంబ్లీలో పుష్ప-2 సినిమాపై జరిగిన చర్చ.. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై ఆదివారం బండి స్పందించారు.
సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన దారుణ ఘటనను అందరూ ఖండించారని.. రేవతి మరణం దురదృష్టకరమని బండి పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కోలుకోవాలని కూడా అందరూ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. అయితే.. దీనిపై సభలో చర్చ పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
దాదాపు 15 రోజుల కిందటి అంశం.. ముగిసిపోయిందని.. కానీ, ఇప్పుడు ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం ఎంఐఎం ఎమ్మెల్యేతో ప్రశ్న అడిగించి.. దీనిని రభస చేసిందని బండి ఆరోపించారు.
రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని.. చనిపోతున్నారని.. వారిని పరామర్శించేందుకు.. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రవంత్‌రెడ్డికి సమయం లేదా? అని బండి నిలదీశారు. విద్యార్థుల మరణాలకు ఎవరు కారకులు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ మరణాలకు ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అని బండి అన్నారు. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న కుట్రగా ఆయన అభివర్ణించారు.
సినిమా ఇండస్ట్రీని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బండి మరో ఆరోపణ చేశారు. సినిమా ఇండస్ట్రీని ఆయన టార్గెట్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పద్ధతి మంచిది కాదన్న ఆయన ఎంఐఎంను నమ్ముకుని గతంలో బీఆర్ ఎస్ పార్టీ పుట్టి మునిగిందని.. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే అవుతుందన్నారు.