రేపు ఉదయం చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఆ పిటిషన్ తీర్పు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రకటించాల్సి ఉండగా..సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. అయితే, తీవ్ర ఉత్కంఠ తర్వాత రేపు ఉదయం 10.30కు తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండిగ్ లో ఉన్న నేపథ్యంలోనే కస్టడీ పిటిషన్ పై తీర్పులో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.

అయితే, కస్టడీ పిటిషన్ కు, క్వాష్ పిటిషన్ కు సంబంధం లేదని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారని తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు ఎపుడు వస్తుంది అన్న విషయంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆరా తీసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, తీర్పును మాత్రం ఏపీ హైకోర్టు రిజర్వులో పెట్టింది. రేపు తీర్పు వెలువడే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను కూడా ఈ నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది.

ఇక, అంగళ్లు కేసులో 79 మంది టీడీపీ నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ రాం భూపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది.