శాసన సభలో స్పీకర్ పదవికి ఎంతో గౌరవం ఉంది. ఆ పదవికి తన్నె తెచ్చిన స్పీకర్లు ఎందరో ఉన్నారు. పార్టీలకీతంగా, నిష్పక్షపాతంగా రూల్ బుక్ ఫాలో అవుతూ సభను సజావుగా నడిపిన స్పీకర్లు ఉమ్మడి ఏపీలో, ఏపీలో చాలామంది ఉన్నారు. సురేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కోడెల శివ ప్రసాద రావు…ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు. కానీ, ప్రస్తుత ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైఖరి, వ్యవహార శైలి, చూస్తుంటే మాత్రం ఆయన ఆ జాబితాలో చేరేలా కనిపించడం లేదు. అంతేకాదు, అసలు స్పీకర్ పదవికి తమ్మినేని అర్హుడేనా అంటూ విమర్శలు వచ్చే స్థాయికి ఆయన తీరు దిగజారడం శోచనీయం. తాజాగా ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ్మినేని హావభావాలు, మాటలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.
‘‘ఎహే..వాట్ ఈజ్ దిస్…పా..ఛత్…యూస్ లెస్ ఫెల్లో…ఎవడయ్యా చెప్పాడు నీకు? వీడియోస్ ఆర్ ప్రొహిబిటెడ్’’ టీడీపీ సభ్యులనుద్దేశించి ఈ రోజు సభలో తమ్మినేని చేసిన కామెంట్లు ఇవి. కట్ చేస్తే…అదే సభలో ‘‘వైఎస్సార్…మెంబర్స్…ప్లీజ్ మనవాళ్లు వెనక్కు రండి…’’ వైసీపీ సభ్యులనుద్దేశించి ఈ రోజు తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఇవి. సభలో సభ్యులను రూల్స్ ప్రకారం సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ, ప్రతిపక్ష సభ్యులు తమ మైక్ కట్ చేస్తున్నారనో, వేరే ఏదైనా విషయంపై మాట్లాడితేనే కస్పు మంటూ ఒంటికాలిపై తమ్మినేని లేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ నేతలను చీదరించుకుంటూ…ఛీత్కారంతో తమ్మినేని మాట్లాడిన మాటలు…ఆప్యాయంగా వైసీపీ సభ్యులను మనోళ్లు అంటూ సంబోధించిన వీడియోలను టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. దీంతో, తమ్మినేని కామెంట్ల వీడియో వైరల్ గా మారింది. ఈ రకంగా పక్షపాత ధోరణితో ఉన్న తమ్మినేని సభను ఎలా నడిపిస్తారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.