నాతోపాటు ఇండస్ట్రీ మొత్తాన్ని వైసీపీ అవమానించింది: బాలకృష్ణ

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్న రీతిలో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంబటిని ఉద్దేశించి మీసం మెలేసిన బాలకృష్ణ తొడగొట్టి మరీ సవాల్ చేశారు. దీంతో, బాలయ్యను స్పీకర్ తమ్మినేని మందలించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సభ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుపై బాలయ్య బాబు సంచలన విమర్శలు చేశారు. అంబటి రాంబాబు సభలో ముందు తనను రెచ్చగొట్టారని బాలకృష్ణ ఆరోపించారు. మీసం మెలేసి తొడ గొట్టారని, తన వృత్తిని అంబటి అవమానించాడని అన్నారు.

అసెంబ్లీలో మీసం మెలేసి తొడగొట్టింది వైసీపీ ఎమ్మెల్యేలే అని, తాను చేయని పనిని చేసినట్లుగా అసత్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారని, మంద బలంతో విర్రవీగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేతిలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈరోజు సభలో తనకు మాత్రమే అవమానం జరగలేదని, యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను వైసీపీ నేతలు కించపరిచారని ఆరోపించారు. తెలుగు సినీ కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారని ఆరోపించారు. సినీ రంగం నుంచి అసెంబ్లీకి వెళ్లిన అన్నగారు ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

రా చూసుకుందాం అని అంబటి అనడంతో తాను కూడా రా చూసుకుందాం అని అన్నానని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తనలా ధైర్యంగా మాట్లాడేవారు కొందరే ఉంటారని, తాను మిగతా వారిలాగా మౌనంగా ఉంటానని అంబటి అనుకున్నారని, కానీ తాను ధైర్యంగా ముందుకు వచ్చేసరికి బిత్తర పోయారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని, ఇలాంటివి టిడిపి ఎన్నో చూసిందని బాలకృష్ణ చెప్పారు. వైజాగ్ లో జూనియర్ ఆర్టిస్టులతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని శాసనసభలో స్పీకర్ కు విజ్ఞప్తి చేశామని, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని కోరామని అన్నారు.

రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా జగన్ తీరు ఉందని సెటైర్లు వేశారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో నిజంగా స్కామ్ జరిగి ఉంటే చార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదని బాలయ్య ప్రశ్నించారు. జగన్ తీరేంటో ఎవరికి అర్థం కావడం లేదని, కక్ష సాధింపు చర్య తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి జగన్ పట్టించుకోవడంలేదని బాలకృష్ణ విమర్శించారు.