చంద్రబాబుకు ఈ రోజూ చుక్కెదురేనా?

అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణను ఈ నెల 26కు హైకోర్టు వాయిదా వేసింది. ఇక, చంద్రబాబును కస్టడీకి కోరుతూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ తో పాటు బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

ఈ రోజు ఉదయం 11 గంటలకు తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే, సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువరిస్తామని ఏసీపీ కోర్టు వెల్లడించింది. చంద్రబాబును 5 రోజుల పాటు సీఐడీ కస్టడీకి కోరింది. ఆయనను కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపితే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని కోర్టుకు తెలిపింది. మరోవైపు, అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ ఈ రోజు జరగనుంది. మరోవైపు, చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తయింది. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ రోజు లేదా రేపు తీర్పు వెలువడే అవకాశముంది.