రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని కాపు నేతలు డిమాండ్ చేశారు. కాకినాడలో జరిగిన చర్చా గోష్టిలో స్థానిక కాపు సంఘం నేతలు, చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానసంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని తీర్మానించారు. టీడీపీతో సహా ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోవద్దని సూచించారు. పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తే పార్టీ ఎప్పటికీ ఎదగదని వాళ్ళు ఆందోళన వ్యక్తంచేశారు.
టీడీపీతో కలిసి జనసేన పోటీచేస్తుందని పవన్ చేసిన ప్రకటనపై వాళ్ళు అభ్యంతరం వ్యక్తంచేశారు. జనసేన ఒంటరిగా పోటీచేస్తేనే కాపుల మద్దతు ఉంటుందని లేకపోతే ఉండదని సమావేశం తేల్చిచెప్పేసింది. ఒంటరిగా పోటీచేస్తే పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందికానీ పొత్తుంటే చంద్రబాబు సీఎం అవుతారు కాని పవన్ ఎలాగ అవుతారని వక్తలు ప్రశ్నించారు. పవన్ సీఎం అవ్వాలని తాము అనుకుంటున్నాము కానీ చంద్రబాబును కాదని స్పష్టంగా చెప్పారు.
వారాహియాత్ర సాగిన ప్రతి నియోజకవర్గంతో పాటు జరగని నియోజకవర్గాల్లో కూడా కాపులతో పాటు ఇతర సామాజికవర్గాలు ముఖ్యంగా యువత జనసేనకు మాత్రమే మద్దతుగా నిలుస్తున్నట్లు వాళ్ళు చెప్పారు. 2019 ఎన్నికలకు ముందున్నట్లు కాకుండా ఇపుడు ప్రతి గ్రామంలోను జనసేన పార్టీ ఆఫీసులున్న విషయాన్ని సమావేశం గుర్తుచేసింది. కాపులో బాగా చైతన్యం వచ్చిందని ఇపుడు గనుక పవన్ ముఖ్యమంత్రి కాలేకపోతే భవిష్యత్తులో కష్టమని కూడా సమావేశం అభిప్రాయపడింది.
అందుకనే జనసేన ఒంటరిగా పోటీచేస్తే కాపులంతా ఏకమై పార్టీని అధికారంలోకి తెచ్చుకుని పవన్ను సీఎంను చేస్తామని గట్టిగా చెప్పారు. కాపు సామాజికవర్గం ఆలోచనలను, ఆకాంక్షలను పవన్ గ్రహించాలని వీళ్ళు డిమాండ్ చేశారు. కాపు సామాజికవర్గం మనోభవాలతో సంబంధంలేకుండా తనిష్టం వచ్చినట్లు తాను నిర్ణయాలు తీసుకుంటానని, నడుచుకుంటానని పవన్ అనుకునేట్లయితే తనిష్టమని కూడా సమావేశం అభిప్రాయపడింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కాపు సోదరుల చర్చా వేదిక పేరుతో జరిగిన సమావేశంలో వక్తలు తమ అభిప్రాయాలను పవన్ కు స్పష్టంగా తెలియజేశారు. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates