తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగితే.. మరో రెండు మాసాలకన్నా కూడా గడువు లేదు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. అధికా రులను కూడా అలర్ట్ చేసింది. అంటే.. జమిలితో సంబంధం లేకుండా.. తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం మెండుగా కనిపిస్తోంది. దీంతో కీలకమైన రాజకీయ పార్టీలు.. తెలంగాణ ఓటరు ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రధానంగా ఇటు గ్యారెంటీలు, అటు సంక్షేమ తుఫాను.. అన్నట్టుగా అధికార, ప్రతిపక్షాలు కురిపిస్తున్న ఎన్నికల వర్షంతో సగటు తెలంగాణ ఓటరు తడిసి ముద్దవుతున్నాడు. ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ తామే ఇచ్చామన్న సెంటిమెంటుతో పాటు.. కీలకమైన గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. దీనిలో ప్రధానంగా తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు 250 గజాల స్థలాన్ని ఉచితంగా ఇవ్వడంతోపాటు.. పేదలకు రూ. 500లకే గ్యాస్ పంపిణీ చేయడం అనే రెండు గ్యారెంటీలపై విస్తృతంగా చర్చ సాగుతోంది.
ఇక, గ్రామీణ స్థాయిలో రైతులకు ఇచ్చిన హామీలపైచర్చ సాగుతుండగా.. నగర, మండల స్థాయిలో ఆర్టీసీ లో మహిళలకుఉచిత ప్రయాణం గ్యారెంటీపై చర్చ జోరుగానే సాగుతోంది. ఇక, ఇతర గ్యారెంటీలపైనా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓటరు నాడిని పట్టుకోవడంఇప్పుడు ప్రయాసగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలావుంటే, ఇప్పటికే అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కారు కూడా అనేక సంక్షేమ పథకాలకు మరింత పదును పెట్టింది.
దళిత బంధుపై ఎవర్ గ్రీన్ ఆశలు పెట్టుకున్న కేసీఆర్.. అదేసమయంలో సాగు నీటి ప్రాజెక్టులు .. తన రాజకీయాలను సాఫీగా సాగనిస్తాయని ఆయన భావిస్తున్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఆర్టీసీ విలీనం, భారీగా ఉద్యోగాల ప్రకటన, సింగరేణి కార్మికులకు బోనస్ సహా బకాయిల విడుదల, అదేసమయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం.. ఇలా.. అనేక సంక్షేమ పథకాలను ఆయన కూడా నమ్ముకున్నారు.
వెరసి మొత్తంగా ఇప్పుడు అటు కాంగ్రెస్ గ్యారెంటీలు.. ఇటు సంక్షేమ పథకాల వరద తెలంగాణ సగటు ఓటరును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఓటరు ఎటు ఉంటాడు? అనే ప్రశ్నకు ఇతమిత్థంగా ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates