తాజాగా ఏపీలో మారిన ఎన్నికల ముఖ చిత్రం అధికార పార్టీ వైసీపీలో నెంబర్ గేమ్‌కు తెరదీసిందని పరిశీల కులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీలు కలిసి పోటీ చేయడం ఖాయమైంది. ఇక, వీటికి కలిసి వచ్చే పార్టీలు కూడా ఎన్నికల్లో చేతులు కలపనున్నాయి. దీంతో ఇప్పటి వరకు వైసీపీ పెట్టుకున్న వైనాట్ 175 వాదనపై వైసీపీలోనే నాయకులు ముఖం చాటేస్తున్నారు. “ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. అసలు లెక్కలు వస్తున్నాయి” అంటూ అనంతపురానికి చెందిన మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
ఇక, తాజాగా సీఎం జగన్ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ‘సంఖ్య తగ్గినా.. నేనే సీఎం’- అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఉద్దేశ పూర్వకంగా చేశారో.. లేక అన్యాపగా ఆయన మనసులోంచి ఈ వ్యాఖ్యలు చొచ్చుకొచ్చాయో తెలియదు కానీ.. ప్రస్తుతం జగన్ కూడా వైనాట్-175 లెక్క కుదరదని తేల్చేసినట్టు అయిపోయింది. ఇక, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 120 స్థానాలలో తమ పార్టీ గెలుస్తుందని.. ఉమ్మడి కృష్నాజిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు ఆఫ్‌ది రికార్డుగా వ్యాఖ్యానించారు.
ఇక, రాజకీయ విశ్లేషకులు.. వైసీపీ అనుకూల మీడియా విశ్లేషకులు కూడా.. వైసీపీకి 130 స్థానాలు ఖాయమని చెబుతున్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో పరిశీలనలు.. ప్రజల నుంచి సర్వేలు సేకరిస్తున్న ఆన్‌లైన్ సంస్థలు ఈ లెక్కలను 110గా తేలుస్తున్నాయి. అయితే.. చంద్రబాబు అరెస్టు.. టీడీపీ ఉద్యమాల వంటి పరిణామాలను వీరు లెక్కలోకి తీసుకున్నట్టుగా లేదు. అయితే.. ఎవరి లెక్కలు వారివే అన్నట్టుగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. వైసీపీలో 175 నుంచి 130, 120, 110 అనే లెక్కలు ప్రస్తుతం తారట్లాడుతున్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే.. క్షేత్రస్థాయిలో పరిణామాలు గమనిస్తే.. రోడ్లు లేవు. ఉపాధి లేదు.ఉద్యోగ ప్రకటనలు కూడా లేవు. మరోవైపు.. మద్య నిషేధం మాట అమలేలేదు. అదేసమయంలో పన్నుల మోత, ధరల వాత సాధారణ ప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో వైసీపీ లెక్కలు ఏమేరకు ఫలిస్తాయనే చర్చ కూడా మేధావుల మధ్య సాగుతోంది. సాధారణ ప్రజానీకం..ఇప్పుడు ఏపీ అభివృద్ధిని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటిసమయంలో వైసీపీ లెక్కలు.. ఆ పార్టీలోనూ ఒకింత గందరగోళంగానే ఉండడం గమనార్హం.