జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా గ్లాసునే కేటాయిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. కొన్ని నెలల కిందట దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఉన్న ఓట్లను.. సీట్లను.. గుర్తింపు వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా పార్టీలగుర్తులను రద్దు చేసింది. ఇలా.. జనసేన కూడా అప్పట్లో తనకు ఉన్న గ్లాస్ గుర్తును కోల్పోయింది. దీంతో అప్పట్లో రాజకీయంగా జనసేనపై ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి అనేక విమర్శలు వచ్చాయి.
అయితే.. తాజాగా ఏపీ సహా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీల ఎన్నికల గుర్తులను కేటాయిస్తూ.. ఎన్నికల సంఘం తాజాగా నిర్ణయించింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయించింది. 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో(కొన్ని స్థానాల్లో)నూ.. 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు. తెలంగాణలో అభ్యర్థులు ఓడిపోగా ఏపీలో ఒక్క సీటు ను మాత్రమే జనసేన దక్కించుకుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జనసేన మళ్లీ పోటీకి సిద్ధమైంది. రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. జనసేన పార్టీ తరఫున పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘంనిర్ణయాన్ని స్వాగతించారు. వైసీపీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందంటూ.. జనసేన నాయకులు ప్రశ్నించారు. రాజకీయాల్లో వాస్తవాలు తెలుసుకుని వ్యవహరించాలని జనసేన నాయకులు సూచించారు.