చంద్రబాబుకు దక్కని ఊరట..బెయిల్ వాయిదా

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు రిమాండ్ రిపోర్టు, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని, అమరావతి రింగ్ రోడ్డు కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించలేదు. అమరావతి ఇన్నర్ రింగురోడ్డు కేసులో ముందస్తు బెయిల్ విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది.

మరోవైపు, స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్ గా వాదనలు వినిపిస్తున్నారు. పీసీ యాక్ట్ 17ఏపై సాల్వే వాదిస్తున్నారు. దీనికి సంబంధించి అనేక తీర్పులున్నాయని ఆయన వాదించారు. ఆర్నబ్ గోస్వామి కేసును ఉదహరించిన సాల్వే…ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతే అరెస్టు చేయాలని వాదనలు వినిపించారు. 2021లో నమోదైన కేసులో ఇప్పుడు చంద్రబాబు పేరును ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. ఇక, చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని అన్నారు. ఆయన అరెస్టు విషయంలో ప్రొసీజర్ ఫాలో కాలేదని వాదించారు.

ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబుపై దురుద్దేశ్యంతోనే కేసు పెట్టారని ఆరోపించారు. అంతకుముందు, సాల్వే 12 గంటలకు అందుబాటులోకి వస్తారని, ఆ సమయంలో విచారణ మొదలుబెట్టాలన్న ప్రతిపాదనకు సీఐడీ తరపు న్యాయవాదులు అంగీకరించారు. ఇక చంద్రబాబును ఈ నెల 18 వరకు కస్టడీలోకి కోరవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగియడంతో ఈరోజు చంద్రబాబును సిఐడి కస్టడీకి 5 రోజులపాటు అప్పగించాలన్న పిటిషన్ పై కూడా విచారణ జరగబోతుంది.