టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ, ప్రతిపక్ష నేతలతో పాటు జాతీయస్థాయి నేతలు, ఐటీ ఉద్యోగులు, టిడిపి ఎన్నారై నేతలు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రముఖ నిర్మాత ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావుతోపాటు పలువురు సినీ ప్రముఖులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపద్యంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తనదైన రీతిలో స్పందించారు.
చంద్రబాబు అరెస్టు తనను ఎంతో బాధించిందని, ఆ బాధలో తాను ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుపుకోలేదని బాధపడ్డారు. చంద్రబాబు జైల్లో ఇబ్బంది పడుతుంటే తనకు అన్నం కూడా తినబుద్ధి కావడంలేదని బండ్ల అన్నారు. ఇక, రాబోయే ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించి చంద్రబాబు మరో మరోసారి సీఎం కావడం ఖాయమని బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. చంద్రబాబు జాతీయ సంపదని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని బండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది బాగుపడ్డారని,అయితే ఐటి ఉద్యోగులు హైదరాబాదులో రోడ్లపై కాకుండా నెల రోజులు ఉద్యోగాలకు సెలవు పెట్టి సొంతూళ్లోని బొడ్రాయి ముందు ధర్నా చేయాలని బండ్ల పిలుపునిచ్చారు. అయితే, పవన్ కళ్యాణ్ ను పవనేశ్వరా అని పిలుస్తూ ఆయన భక్తుడిగా పేరున్న బండ్ల గణేష్ టీడీపీతో జనసేన పొత్తు ప్రకటన తర్వాత చంద్రబాబుకు మద్దతుగా కామెంట్లు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.