పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తొలిరోజు.. లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు 42 నిమిషాల పాటు ఆయన 75 ఏళ్ల పార్లమెంటు ప్రస్థానంపై చర్చను ప్రారంభించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన కీలకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కూడా ఈ పార్లమెంటు భవనంలోనే జరిగిందన్న ప్రధాని.. అయితే, శాస్త్రీయంగా ఈ విభజన జరగలేదని విమర్శలు గుప్పించారు.
“తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగింది. కానీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబ ద్ధంగా, శాస్త్రీయంగా జరిగింది. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయి. ప్రజలు ఎంతో సంతోషించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదు” అని ప్రధాని మోడీ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల ప్రజలను సంతృప్తిపర్చలేకపోయిందని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందన్న ప్రధాని.. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో ఏపీకి అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందని, ఇది దారుణమని వ్యాఖ్యానించారు.