చారిత్ర‌క నిర్ణ‌యాలు త‌ప్ప‌వు: మోడీ

పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాల్లో చారిత్ర‌క నిర్ణ‌యాలే ఉంటాయ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్ప‌ష్టం చేశారు. స‌మావేశాల‌ ప్రారంభానికి ముందు ప్ర‌ధాని ఈ రోజు ఉద‌యం పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడారు. జీ-20 స‌మావేశాల‌ను విజ‌యవంతంగా నిర్వ‌హించామ‌ని తెలిపారు. భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావ‌డం ప‌ట్ల‌ ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ప్రపంచ భవిష్యత్తుకు భారత్‌ ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. పార్ల‌మెంటు ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్‌ పయనిస్తోందన్న ఆయ‌న‌.. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు.

దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోందని ప్ర‌ధాని అన్నారు. దేశాభివృద్ధి నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నామ‌న్నారు. పార్ల‌మెంటు ప్రత్యేక సమావేశాలకు ఐదు రోజులు మాత్ర‌మే కేటాయించినా.. స‌మావేశాలు జరుగుతున్న సందర్భం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ స‌మావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నామ‌ని ప్ర‌ధాని తెలిపారు.

ఏడుపుల‌కు స‌మ‌యం కాదు!

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ సభ్యులంతా ప్ర‌త్యేక స‌మావేశాల‌కు హాజరుకావాలని కోరుకుంటున్నామ‌ని, ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదని వ్యాఖ్యానించారు. విశ్వాసం, సానుకూల దృక్పథంతో స‌భ‌ల‌ను నిర్వహించుకుందామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. సభ్యులంతా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నామ‌ని ప్ర‌ధాని అన్నారు.