అంద‌రి చూపూ బ్రాహ్మ‌ణి పైనే

అనుకోని అతిథులు కామ‌నే. మ‌న జీవితాల్లోనూ ఎంతో మంది అనుకోకుండా త‌ట‌స్థ ప‌డ‌డం, వారితో మ‌న‌కు సాన్నిహిత్యం ఏర్ప‌డడం తెలిసిందే. అయితే, రాజ‌కీయాల్లోనూ ఇలాంటి సంద‌ర్భాలు ఉంటాయా? ఇలా కూడా జ‌రుగుతుందా? అంటే.. జ‌రుగుతుంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ఏపీ టీడీపీకి అనుకోని అతిథి ప‌రిచ‌యం అయ్యారు. ఇలా అనుకోని అతిథి వ‌స్తార‌ని కానీ, పార్టీకి కీల‌కంగా మార‌తార‌ని కానీ.. ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ, ఇప్పుడు అంద‌రి చూపూ అనుకోని అతిథిపైనే ఉండడం గ‌మ‌నార్హం.

ఆస‌క్తిగా ఉన్న ఆ అనుకోని అతిథి మ‌రెవ‌రో కాదు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోడ‌లు, నారా లోకేష్ స‌తీమ ణి నారా బ్రాహ్మ‌ణి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న మానాన త‌ను ఉంటూ.. ఇల్లు, వ్యాపారం, ఉన్న‌త విద్య‌, ఇత‌ర అభిలాష‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మై.. ప్ర‌జాక్షేత్రం అంటే పెద్ద‌గా తెలియ‌ని బ్రాహ్మ‌ణి..ఇప్పుడు అనూహ్యంగా ప్ర‌జాక్షేత్రంలోకి వ‌చ్చారు. అంతేకాదు.. సీనియ‌ర్ నాయ‌కులు సైతం కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ.. త‌డ‌బ‌డుతుంటే.. తొలిసారి మీడియా ముందుకు రాజ‌కీయంగా వ‌చ్చినా.. ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా.. మాట‌ల తూటాలు పేలుస్తున్నారు బ్రాహ్మ‌ణి.

టీడీపీ ఒంట‌రి కాద‌ని, రాష్ట్ర ప్ర‌జ‌లే పార్టీ కుటుంబ‌మ‌ని నారా బ్రాహ్మ‌ణి చేసిన వ్యాఖ్య‌లు ఇటు సాధార‌ణ మీడియాలోనూ, అటు సోష‌ల్ మీడియాలోను జోరుగా వైర‌ల్ అయ్యాయి. అంతేకాదు.. మీడియాతో మాట్లాడే స‌మ‌యంలోనే కాకుండా.. చంద్ర‌బాబు అరెస్టును నిర‌సిస్తూ.. నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లోనూ బ్రాహ్మ‌ణి పాల్గొన్న తీరు పార్టీలో ఆత్మ విశ్వాసం పెంపొందించేలా ఉంద‌ని మాన‌సిక వైద్య నిపుణులు సైతం పేర్కొంటున్నారు. ఎక్క‌డా త‌డ‌బాటు లేదు. ఆత్మ‌స్థ‌యిర్యంతో ఆమె మాట్లాడుతున్న తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది అని విజ‌య‌వాడ‌కు చెందిన ప్ర‌ముఖ మానసిన వైద్య నిపుణులు ఒక‌రు పేర్కొన్నారు.

ఇక‌, పార్టీ కార్య‌క‌ర్త‌ల ప‌రంగా చూసుకున్నా.. బ్రాహ్మ‌ణి చేసిన కామెంట్లు, ఆమె మాట తీరు.. వంటివి వారిలో ఉత్సాహం నింపుతున్నాయి. ఏదైనా అత్య‌వ‌స‌ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డి.. పార్టీని న‌డిపించాల్సిన అవ‌స‌రం వ‌చ్చినా.. నారా బ్రాహ్మ‌ణి అందుకు సంపూర్ణంగా ముందుకు వ‌స్తార‌నే భ‌రోసా కూడా పార్టీ నాయ‌కుల్లోనూ క‌నిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. గ‌డిచిన రెండు రోజుల్లో నారా బ్రాహ్మ‌ణి రాజ‌కీయంగా చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌జ‌ల‌తోనూ.. పార్టీ నాయ‌కుల‌తోనూ మ‌మేక‌మైన తీరు.. టీడీపీకి అనుకోని అతిథిని అందించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.