స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో.. సీమెన్స్‌ మాజీ ఎండీ షాకింగ్ ప్రెస్ మీట్

ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వాన్ని కుదిపేస్తున్న స్కిల్ డెవ‌ల‌ప్‌మెంటు కేసు విష‌యంలో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమ‌న్ బోస్ స్పందించారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో 341 కోట్ల రూపాయ‌ల అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం చంద్ర‌బాబును అరెస్టు చేసి, రిమాండ్ ఖైదీగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉంచిన విష‌యం తెలిసిందే. దీనిపై సుమ‌న్ బోస్ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్ మెంట్ కేసు నీరదారమైనద‌ని వ్యాఖ్యానించారు.

బిల్డ్ -ఆపరేట్- ట్రాన్స్ ఫర్(బీఓటీ) పద్దతిలో ఈ ప్రాజెక్ట్ నడిచిందని సుమ‌న్ బోస్ వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ అధికారులు చేస్తున్న ఆరోప‌ణ‌లు నిరాధార‌మ‌ని పేర్కొన్నారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో అక్రమా లు జరిగాయనేది అబద్దమ‌ని తెలిపారు. 2021 వరకు స్కిల్ డవెలప్ మెంట్ ద్వారా2.13 లక్షలమంది యువ‌త‌కు కి శిక్షణ ఇచ్చిన‌ట్టు సుమ‌న్ బోస్ వివ‌రించారు. అనంతరం 2021లోనే శిక్షణ కేంద్రాలను పూర్తిగా ఏపీ ప్రభుత్వానికి అప్పగించామ‌న్నారు. అంటే.. అప్ప‌టికీ సీఎంగా జ‌గ‌నే ఉన్నారు.

ఇక‌, ఏపీఎస్ఎస్ డీసీలో ఏంజరిగిందో త‌న‌కు తెలియదని బోస్ పేర్కొన్నారు. గతంలో మెచ్చుకున్న ఏపీఎస్ఎస్ డీసీనే ఈ ప్రాజెక్ట్ బోగస్ అని ఆరోపించడం విడ్డూరంగా ఉంద‌న్నారు. శిక్షణ కేంద్రాలను చూడకుండా పరిశీలించకుండా అక్రమాలు జరిగాయని ఆరోపించడం స‌రికాద‌న్నారు. కానీ, ఒక్క కేంద్రాన్ని కూడా ప్ర‌భుత్వ అధికారులు సందర్శించలేదని, క‌నీసం వ‌స‌తుల‌ను, సాఫ్ట్‌వేర్‌ను కూడా తనిఖీ చేయ‌లేద‌ని బోస్ పేర్కొన్నారు.

“ఒక హత్య జరిగిందని. దీనిపై విచారణ చేయాలని అంటున్నారు. చిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు. బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు. 2018లోనే ఈ ప్రాజెక్ట్ నుండి నేను బయటకు వెళ్లిపోయాను. 2021 తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్కిల్ ప్రాజెక్ట్ చాలా విజయవంతమైన ప్రాజెక్ట్” అని సుమ‌న్ బోస్ పేర్కొన్నారు. 2016లో చాలా విజయవంతమైన ప్రాజెక్ట్ నమూనగా కేంద్రం ప్రకటించింద‌న్నారు.