కవితకు ఊరటేనా ?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు కాస్త ఊరటదక్కినట్లేనా ? లిక్కర్ స్కామ్ లో విచారణకు ఈరోజు ఢిల్లీలోని తమ ఆఫీసులో హాజరవ్వాలని ఈడీ కవితకు నోటీసులిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈడీ ఇచ్చిన నోటీసులను ఛాలెంజ్ చేస్తూ కవిత సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. ఆ కేసును విచారించిన సుప్రింకోర్టు ఈనెల 26వ తేదీవరకు నోటీసులు ఇవ్వద్దని ఈడీని ఆదేశించింది. ఈ ఆదేశాలను చాలెంజ్ చేస్తు ఈడీ మరో కేసు వేస్తుందా లేదా అన్నది చూడాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున కవిత పాత్ర చాలా కీలకమని ఈడీ ఎప్పుడో తేల్చేసింది. ఈ కేసులో ఇప్పటికే చాలామందిని అరెస్టుచేసింది. ఇద్దరు ముగ్గురు బెయిల్ పైన బయటున్నారు, మరికొందరు జైల్లోనే ఉన్నారు. ఈమధ్యనే అరుణ్ రామచంద్ర పిళ్ళైని ఈడీ అరెస్టు చేసి విచారించింది. పిళ్ళై అరెస్టయిన రెండు రోజులకే ఈడీ కవితకు నోటీసులు జారీచేసింది. ఎందుకంటే కవితకు పిళ్ళై బినామీ అనే ప్రచారం అందరికీ తెలిసిందే. పిళ్ళై అప్రూవర్ గా మారిపోయి కవిత పాత్రకు సంబంధించిన అన్నీ వివరాలను ఈడీకి చెప్పేశారని ఒక్కసారిగా ప్రచారం పెరిగిపోయింది.

అయితే తాను అప్రూవర్ గా మారలేదని పిళ్ళై మొత్తుకుంటున్నారు. విచారణలో ఏమిజరిగిందో ఎవరికీ తెలీదు కానీ వెంటనే ఈడీ కవితకు నోటీసులు ఇవ్వటం మాత్రం సంచలనమైంది. కారణం ఏమిటంటే తొందరలోనే తెలంగాణాలో ఎన్నికలు జరగబోతుండటమే. రాబోయే ఎన్నికల్లో కవిత అరెస్టు లేదా కవిత పాత్రే కీలక అంశంగా మారబోతోందనటంలో సందేహంలేదు. కవితను అరెస్టునుండి తప్పించేందుకే నరేంద్రమోడీకి కేసీయార్ సరెండర్ అయిపోయారని లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ పదేపదే హోరెత్తించేస్తోంది.

కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను జనాలు నిజమే అని నమ్ముతున్నారు. ఎందుకంటే ఒకపుడు మోడీ అంటేనే అంతెత్తున ఎగిరిపడే కేసీయార్ ఇపుడు కనీసం మాట కూడా ఎత్తటంలేదు. ఒకపుడు కవితను ఈడీ అరెస్టుచేయబోతోందని విపరీతంగా ప్రచారమైంది. అప్పటినుండే మోడీపై కేసీయార్ మాట్లాడటం మానుకున్నారు. సో, జరుగుతన్న పరిణామాలను చూసిన తర్వాత జనాలు కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయనే అనుకుంటున్నారు. లేకపోతే కవిత అరెస్టుకు ఈడీ ఎందుకు వెనకాడుతుంది ?