మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం ఏంటో అర్థమైపోయింది. అనుకున్నట్లే తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విషయమై నిన్న క్రిస్టల్ క్లియర్‌గా ప్రకటన చేసేశాడు. ఐతే పొత్తును ప్రకటించే విషయంలో పవన్ తొందరపడ్డాడని.. ఇంకా సీట్ల పంపిణీ విషయమై చర్చలే మొదలుకాకముందే హడావుడిగా ఇప్పుడీ ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జనసేనలో ఒక వర్గం ప్రశ్నిస్తోంది. దీని వల్ల సీట్ల పంపిణీలో పవన్ బార్గైనింగ్ పవర్ కోల్పోయాడనే చర్చ కూడా నడుస్తోంది.
రేప్పొద్దున తమకు సీట్లు తక్కువ ఇవ్వజూపినా పవన్ సర్దుకుపోవాల్సిందే అని, పొత్తు ప్రకటన చేసింది తనే కాబట్టి వెనక్కి తగ్గలేక టీడీపీ ఎన్ని సీట్లిస్తే అన్నింటితో సర్దుకుపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వారంటున్నారు. పవన్ ప్రకటన పార్టీ నేతలు, కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేలా ఉందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
ఐతే ఈ విషయాల్లో వాస్తవం లేకపోలేదు కానీ.. ఇక్కడ పవన్ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అందరికీ తెలియజెప్పాలనుకున్నాడు. తనకు మిగతా అన్ని విషయాల కంటే జగన్‌ను ముఖ్యమంత్రి సీటు నుంచి దించడమే ప్రధాన లక్ష్యమని.. అదే అందరి లక్ష్యం కావాలని పవన్ చెప్పకనే చెప్పేశాడు. ఇప్పుడు తమకు కొంత ఇబ్బంది తలెత్తినా.. కొంత అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ.. మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకూడదన్నది పవన్ ఉద్దేశం. అదే జరిగితే జరిగే అరాచకాలను తట్టుకోలేమని.. ఒక్కసారి ఛాన్స్ దొరికితేనే ప్రతిపక్ష పార్టీలను దారుణంగా టార్గెట్ చేశారని.. అలాగే ఏపీలో అభివృద్ధి ఆగిపోయి రాష్ట్రం అథోగతి పాలైందని పవన్ భావిస్తున్నారు.
మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలు ఊహకందని విధంగా ఉంటాయని.. ఇటు జనసేన, అటు టీడీపీ పార్టీలను ఇంకా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసి వాటి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తారని.. అందుకే పొత్తు వల్ల, ముందే ప్రకటన చేయడం వల్ల జనసేనకు కొంత అన్యాయం జరిగినా పర్వాలేదని.. కానీ జగన్‌ను దించాలంటే మాత్రం కొంత రాజీ పడక తప్పదని.. జనసైనికులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని పవన్ చెప్పకనే చెప్పినట్లయింది.