నారా లోకేష్ ఢిల్లీ బాట

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ బాట ప‌ట్టారు. గురువారం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, త‌న తండ్రి నారా చంద్ర‌బాబుతో ములాఖ‌త్ అయిన అనంత‌రం.. తీసుకున్న నిర్ణ‌యంలో భాగంగా నారా లోకేష్‌.. ఢిల్లీకి ప‌య‌నం కావ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. చంద్ర‌బాబు అరెస్టు, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంటులో స్కాం వంటి అంశాల‌పై కొంద‌రు జాతీయ‌స్థాయి నాయ‌కులు, చంద్ర‌బాబు మిత్రులు స్పందించారు.

అయితే.. ఈ స్పంద‌న అనుకున్నంత వేగంగా జ‌ర‌గ‌లేద‌ని, అదేవిధంగా అనుకున్న విధంగాను స‌ద‌రు నాయ‌కులు స్పందించ‌లేద‌ని టీడీపీలోని ఓ వ‌ర్గం భావిస్తోంది. నిజానికి జాతీయ‌స్థాయిలో చంద్ర‌బాబుకు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ పాటికి భారీ ఎత్తున స్పంద‌న రావాల్సి ఉంది. అదేస‌మ‌యంలో కేంద్రం కూడా ఈ విష‌యంపై(స‌ద‌రు జాతీయ నేత‌ల స్పంద‌న‌ను బ‌ట్టి) స్పందించాల్సి ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలు అనుకున్నాయి. అయితే, వారు అనుకున్న‌ట్టుగా స్పంద‌న క‌నిపించ‌లేదు.

ఇక‌, జాతీయ మీడియాలో కొద్దిపాటి చ‌ర్చ జ‌రిగినా.. అది కూడా రేంజ్ స‌రిపోలేద‌నే పెద‌వి విరుపులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో 14 ఏళ్ల‌పాటు సీఎంగా ప‌నిచేసిన చంద్ర‌బాబు అరెస్టుపై జాతీయ‌స్థాయిలో తీవ్ర స్పంద‌న/చ‌ర్చ‌ వ‌చ్చేలా.. కీల‌క నేత‌లు క‌దిలేలా.. అదేస‌మ‌యంలో ఏపీ స‌ర్కారు స‌హా కేంద్రంపైనా ఈ విష‌యంపై ఒత్తిడి పెరిగేలా చేయాల‌న్న‌ది తాజాగా టీడీపీ వ్యూహమ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే నారా లోకేష్ ఢిల్లీకి ప్ర‌యాణ‌మ‌య్యారు.

సుమారు రెండు రోజుల పాటు నారా లోకేష్ ఢిల్లీలోనే ఉండి.. వ‌రుస‌గా జాతీయ మీడియాతో చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని, అదేస‌మ‌యంలో త‌మ‌తో క‌లిసి వ‌చ్చే ప్రాంతీయ‌, జాతీయ పార్టీల అధినేత‌ల‌తోనూ ఆయ‌న చ‌ర్చించి.. చంద్ర‌బాబు అరెస్టు, రిమాండ్‌ విష‌యాల‌ను జాతీయ‌స్థాయిలో ఒక ఉద్య‌మంగా తీసుకువ‌చ్చే వ్యూహంతో ఉన్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే నారా లోకేష్ ఢిల్లీ ప‌ర్య‌ట‌నకు ఎన‌లేని ప్రాధాన్యం పెరిగింద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఏమేర‌కు స్పంద‌న వ‌స్తుందో చూడాలి.