ఏపీ బీజేపీ శాఖకు అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి పెను సవాలే ఎదురైందా? తాను లేదా తన పార్టీ పెద్దలు చేయాల్సిన ప్రకటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఆమె విషయం పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. 2024 లేదా అంతకన్నా ముందే ఏపీ ఎన్నికలు వస్తే.. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని చెబుతూనే బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు.
అయితే, దీనిపై బీజేపీలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరిని మాట మాత్రం కూడా సంప్రదించకుండానే పవన్ ఇలా బహిరంగ ప్రకటన చేయడంపై ఆ పార్టీలో మెజారిటీ నాయకులు విస్తు బోతున్నారు. ఆమె కంటే కూడా బీజేపీ పెద్దలతో పవన్‌కు సాన్నిహిత్యం ఉందా? వారిని అంతర్గతంగా సంప్రదించిన తర్వాతే.. పవన్ ఇలాంటి హామీ ఇచ్చేశారా? అని కీలక నాయకులు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
వాస్తవానికి బీజేపీ జాతీయ పార్టీ. ఎన్నికల్లో పొత్తులు, ఎత్తుల విషయంపై కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఇదే విషయాన్ని పురందేశ్వరి పదే పదే చెబుతున్నారు. ప్రస్తుతం తాము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని, ఎన్నికల సమయానికి ఎలాంటి వైఖరి అవలంబించాలనే విషయాన్ని కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని కూడా ఆమె చెబుతున్నారు. అయితే, ఉరుములు లేని పిడుగు మాదిరిగా ఇప్పుడు అనూహ్యంగా పవన్ చేసిన ప్రకటన ఒకరకంగా పురందేశ్వరిని ఇరకాటంలో పడేసిందని పార్టీ నాయకులు అంటున్నారు.
ఇప్పుడు ఈ విషయంపైనే నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. పురందేశ్వరి కన్నా కూడా కేంద్ర నాయకత్వంతో పవన్‌కు పరిచయాలు ఉన్నాయా? వారితో సంప్రదించిన తర్వాతే.. ఇంత ధీమాగా ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూడా కలిసి వస్తుందని ప్రకటించారా? అనేది కీలక నేతల వాదన. ఇదిలావుంటే, ఇప్పటికిప్పుడు మాత్రం బీజేపీ ఏపీ మీడియా విభాగం మాత్రం టీడీపీ విషయాన్ని ప్రస్తావించకుండా.. తాము ప్రస్తుతం జనసేనతోనే పొత్తులో ఉన్నామని.. ప్రకటించింది. మొత్తంగా ఈ పరిణామం చూస్తే.. పురందేశ్వరిని పవన్ ఇరకాటంలో పడేశారా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. మరి దీనిపై చిన్నమ్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates