బ్రేకింగ్: టీడీపీతో పొత్తుపై పవన్ షాకింగ్ ప్రకటన

రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కొంతకాలంగా ఆలోచిస్తున్నానని, ఈ రోజు నిర్ణయం తీసుకున్నానని అన్నారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలంటే సమిష్టిగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఇన్ని రోజులు టీడీపీతో కలిసి వెళ్లాలా, వద్దా అని ఆలోచనతో ఉన్నానని, కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

ఈ విషయాన్ని, ప్రస్తుతం చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జనసేన నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు గమనించాలని పవన్ పిలుపునిచ్చారు. విడివిడిగా పోటీ చేస్తే…దశాబ్దాల తరబడి ఇదే పరిస్థితి వస్తుందని, అందుకే ఏపీ భవిష్యత్తు కోసం కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నానని అన్నారు. మాజీ సీఎంకే ఈ దుస్థితి వస్తే…అధికారులు, సామాన్యుల పరిస్థితి ఏమిటటని ప్రశ్నించారు. చంద్రబాబుపై కేసు తరహాలోనే ఏపీలో డ్రగ్స్ తో పాటు మరిన్ని కేసులున్నాయని, ఆ కేసులను మీడియా కూడా సరిగ్గా బయటకు తేవడం లేదని ఆరోపించారు. ఈ రోజు చంద్రబాబుకు జరిగిందని, రేపు మారుమూల గ్రామాలలో చిన్నపాటి నేతలకూ ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు.

తనకు మద్దతుగా ఉన్న జనసేన వీర మహిళలపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, కానీ స్కిల్ స్కాం కేసులో అధికారులను బాధ్యులను చేయాలని, కానీ, చంద్రబాబుపై రాజకీయ ప్రతీకారం కోసమే ఈ కేసు పెట్టారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తన స్థాయి వ్యక్తనే బోర్డర్లో పోలీసులు ఆపేశారని, సగటు మనిషిని బతకనిస్తారా అంటూ వైసీపీపై మండిపడ్డారు. బిజెపి, జనసేన, టీడీపీ కలిసి వెళ్లాలని తన కోరిక అని, 2014 మాదిరి ఫలితాలు తీసుకురావాలన్నది తన అభిప్రాయమని అన్నారు.