స్కిల్ ట్రైనింగ్ కేసులో అరెస్టై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా రాజకీయ నేతలే కాకుండా వివిధ వర్గాల వారు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న బాబు భద్రత, ఆరోగ్య పరిస్థితిపై సైతం పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ యువనేత నారా లోకేష్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని పేర్కొన్న తలైవా చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకి రక్ష అని స్పష్టం చేశారు.
తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనను ఏం చేయలేవని రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. తలైవా ఫోన్ కాల్, ఆయన చెప్పిన మాటలతో టీడీపీ శ్రేణులు ఖుష్ అవుతున్నాయి.
కాగా, ఇటీవలి కాలంలో టీడీపీకి సన్నిహితంగా సూపర్‌స్టార్ రజనీ వ్యవహరించడం ఇది రెండో సారి. కొన్ని రోజుల కిందట విజయవాడ శివారులో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ప్రారంభ వేడుకలకు రజనీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్, చంద్రబాబును పొగిడారు. దీనిపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేయగా అధికార వైసీపీ తలైవాను తప్పుపట్టింది. ఎన్టీఆర్ శతజయంతి దుమారం సద్దుమణుగుతున్న సమయంలో తాజాగా బాబు అరెస్టుపై ఆయన స్పందన రాజకీయంగా తీవ్ర విమర్శలు రేగేందుకు కారణం కావచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.