చంద్రబాబు సీఐడీ కస్టడీకి హైకోర్టు బ్రేక్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును హౌస్ కస్టడీకి అప్పగించాలని ఆయన తరపు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే చంద్రబాబుపై ఎఫ్ ఐ ఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు మరో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ క్వాష్ పిటిషన్ పై విచారణను ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.

ఈ క్రమంలోనే ఈ క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సిఐడి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సిఐడి కస్టడీకి సోమవారం వరకు చంద్రబాబును అప్పగించవద్దని చంద్రబాబు లాయర్లు కోరారు. వారితో ఏకీభవించిన హైకోర్టు….సోమవారం వరకు చంద్రబాబు కస్టడీ కోరవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వులు, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఏపీ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులు వాదనలు వినిపించారు. మరోవైపు, చంద్రబాబుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కూడా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరగనుంది. దాంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును రిమాండ్ రిపోర్టు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై కూడా ఈ రోజే హైకోర్టులో విచారణ జరగనుంది. మంగళవారం వరకు సీఐడీ కస్టడీ లేకపోవడంతో చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట
లభించినట్లయింది.