17న ట్విస్ట్ లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధం!

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ జోరుమీదుంది. ఇప్పటికే టికెట్ల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పుడు వీటిని పరిశీలించి, అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నుంచి నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న భారీ ట్విస్ట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ నెల 17న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు షురూ చేసింది. ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించి ఎన్నికలకు ముందు ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు సభకు హాజరు కానున్నట్లు తెలిసింది. ఈ సభ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి కూడా షాక్ ఇవ్వాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా తెలుస్తోంది.

సెప్టెంబర్ 17న జరిగే సభలో ఎక్కువ సంఖ్యలోనే ఇతర పార్టీల కీలక నాయకులను చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని తెలిసింది. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ ఈ సభలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమైంది. వీళ్లతో పాటు ఆ రోజు పార్టీలోకి ఊహించని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ తరపున టికెట్లు దక్కించుకున్న ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా కాంగ్రెస్లో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఊహించని ట్విస్ట్ ఇస్తామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మరి ఆ నాయకులు ఎవరో తేలాలంటే ఈ నెల 17 వరకు ఆగాల్సిందే.