ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 14 రోజుల రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబును హౌస్ రిమాండ్ కు తరలించాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయవాడలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరపు న్యాయవాదులు శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు రేపటికి వాయిదా వేశారు.
అంతకుముందు, చంద్రబాబు తరఫు లాయర్లపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యమెంట్లు సీఐడీ కార్యాలయంలో ఉన్నాయని, వాటి పరిశీలన కోసం అనుమతించాలని సెక్షన్ 207 CRPC కింద చంద్రబాబు తరఫు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన వెంటనే వాదనలు వినిపించేందుకు లూథ్రా ప్రయత్నించారు. ఈ క్రమంలో లూథ్రాపై జడ్జి హిమబిందు అసహనం వ్యక్తం చేశారు. వరుసగా పిటిషన్లు దాఖలు చేయడం, ఆ వెంటనే వాదనలు వినిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస పిటిషన్లు వేయడం వల్ల కోర్టు సమయం వృథా అవుతోందని అన్నారు. ఆర్డర్ ఇచ్చే సమయానికి మరో పిటిషన్ వేయడంపై అసహనం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates