‘నా స్టేట్ మెంట్ ఆధారంగా బాబుపై కేసు పెట్టారనడం షాక్’

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్ విషయంపై మాజీ ఐఏఎస్ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ఆయన మాట్లాడుతూ.. సీఐడీ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారిగా పీవీ రమేశ్ పని చేశారు. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో రమేశ్ వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసింది. సీఐడీకి ఆయన లిఖిత పూర్వక సమాధానాలిచ్చారు.

ఇప్పుడు రమేశ్ స్టేట్ మెంట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడి మీద సీఐడీ కేసు పెట్టిందని మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని రమేశ్ ఖండించారు. తన స్టేట్ మెంట్ ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద సీఐడీ కేసు పెట్టిందనడం అవాస్తమని, నిరాధారమని రమేశ్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. “నా స్టేట్ మెంట్ ఆధారంగానే మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ కేసు పెట్టిందనడం నిరాధారం. ఇది షాకింగ్ గా ఉంది. నా వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్టు చేశారనడం హాస్యాస్పదం. అలాగే నేను అప్రూవర్గా మారాననే ప్రచారంలోనూ నిజం లేదు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువతకు నైపుణ్యాలు అందించాలనే ఉద్దేశంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజక్టె కోసం ముందుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్లో ఆర్థిక శాఖ ఎలాంటి తప్పు చేయలేదు. సీఐడీ తీరుపై నాకు అనుమానం కలుగుతోంది. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు? నేను చెప్పింది సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని నా అనుమానం. నిధులు విడుదల చేసిన వాళ్లలో కొందరి పేర్లు కేసులో లేవు. స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, కార్యదర్శిల పేర్లు ఎందుకు లేవు. వీళ్ల పాత్రే ప్రధానం” అని పీవీ రమేశ్ పేర్కొన్నారు.