జనసేన బలపడుతోందా ?

ఉత్తరాంధ్రలో జనసేన మెల్లిగా బలపడుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నపరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నంలోని కొందరు వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అధికారపార్టీ తరపున పోటీచేయటానికి రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కవన్న ఏకైక అనుమానంతోనే కొందరు జనసేనలో చేరే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే కారణంపై ఇప్పటికే విశాఖ నగర అధ్యక్షుడుగా పనిచేసిన మాజీ ఎంఎల్ఏ పంచకర్ల రమేష్ జనసేనలో చేరిన విషయం తెలిసిందే.

ఇదే వరసలో నగరంలోని మరో నేత మళ్ళ విజయేంద్రప్రసాద్ కూడా తొందరలోనే పార్టీని వదిలేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం పెరిగిపోతోంది. విశాఖనగరంలోని చాలామంది సీనియర్ నేతలు వైసీపీ తరపున టికెట్లను ఆశిస్తున్నారు. అయితే అందరికీ ఎకామిడేట్ చేసే అవకాశంలేదు. ఇప్పటికే నాలుగు నియోజకవర్గాలకు నలుగురు ఇన్చార్జిలుగా ఉన్నారు. బహుశా ఈ నలుగురికే టికెట్లు దక్కే అవకాశాలున్నాయి. లేకపోతే మహాయితే ఒకళ్ళిద్దరిని మారిస్తే మార్చవచ్చంతే.

ఇలా జరిగినా మిగిలిన వాళ్ళకి నిరాసతప్పదు. అందుకనే పార్టీకన్నా పోటీచేయటమే ముఖ్యమని అనుకున్న నేతలు ఏదోరోజు పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. వైసీపీకి రాజీనామా చేయబోయే నేతలు తమ ఫస్ ఆప్షన్ గా జనసేననే ఎంచుకుంటున్నారట. అందుకని వైసీపీ నుండి రాబోయే నేతలతో జనసేన బలమైన ఫోర్సుగా మారబోతోందనే ప్రచారం మొదలైంది. మామూలుగానే ఉత్తరాంధ్రలో జనసేన బలంగా ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

నిజానికి జనసేన ఉత్తరాంధ్రలో బలంగా ఉంది అనేందుకు ఆధారాలు ఏమీలేవు. అయినా ఆ ప్రచారం అలా జరిగిపోతోంది. దానికితోడు వైసీపీ నుండి నేతలు వచ్చి చేరితే అప్పుడు నిజంగానే బలంగా తయారయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వైసీపీ నేతలు వచ్చి జనసేనలో చేరటం ఒక్క విశాఖ నగరంలో మాత్రమేనా లేకపోతే మిగిలిన విశాఖ రూరల్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా చేరుతున్నారా అన్న విషయమై క్లారిటిలేదు. మొత్తంమీద చాపకింద నీరులాగ జనసేన బలపడుతోందన్న విషయం అర్ధమవుతోంది. మరి ఎన్నికల నాటికి ఏమవుతుందో చూడాలి.