స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దాదాపు 6 గంటల ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా చంద్రబాబుకు రిమాండ్ విధిస్తున్నట్లుగా న్యాయమూర్తి తీర్పును ప్రకటించారు. సిఐడి తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలిచ్చారు.సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో భారీగా పోలీసులను కోర్టు బయట మోహరించారు. అదనంగా పారామిలటరీ బలగాలను పిలిపించారు. ఒక కాన్వాయ్ లో పోలీసులను, మరో కాన్వాయ్ లో చంద్రబాబును తీసుకువెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఎక్కడికి అక్కడ వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates