విదేశాల నుండి రాగానే మంత్రి కేటీయార్ ఏదో చేసేస్తారని చాలామంది గంపెడాశతో ఎదురుచూశారు. అయితే కేటీయార్ విదేశాలనుండి వచ్చారు పర్యటనలు కూడా చేస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా ఎవరినీ కలవటానికి ఇష్టపడటంలేదు. ఆశావహులను, అసంతృప్తవాదులను కలవటానికి కేటీయార్ ఏమాత్రం ఇష్టపడటంలేదని సమాచారం. ఇటు కేసీయార్ ను కలవలేక అటు కేటీయారూ కలవలేకపోవటంతో నేతల్లో అసంతృప్తి తీవ్రస్ధాయిలో పెరిగిపోతోందట.
అందుకనే టికెట్లు దక్కని వాళ్ళంతా బీఆర్ఎస్ ను వదిలేసి ఎవరిదారి వాళ్ళు చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు చాలామంది తొందరలోనే బీఆర్ఎస్ కు రాజీనామాలు చేయబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. టికెట్లు రాకపోవటం ఒక సమస్య అయితే కేసీయార్, కేటీయార్ వైఖరి మరో సమస్యగా మారిందట. అందుకనే వీళ్ళకి బుద్ధిరావాలంటే పార్టీని వదిలేయాల్సిందే అని కొందరు అనుకుంటున్నారట.
కేటీయార్ కోణంలో సమస్య ఏమిటంటే అసంతృప్తులకు, ఆశావహులకు ఏమని సమాధానం చెప్పాలో కేటీయార్ కు అర్ధంకావటంలేదట. కేసీయార్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో ఎంతమంది కేటీయార్ సిఫారసుతో టికెట్లు తెచ్చుకున్నారనే విషయంలో సరైన క్లారిటిలేదు. ఎవరికి ఏమిచెప్పాలో అర్ధంకాక టికెట్లు దక్కని నేతలను కలవటానికి కేటీయార్ ఇష్టపడటంలేదు. నిజానికి కేసీయార్ అభ్యర్ధలు లిస్టు ప్రకటించే రెండురోజుల ముందే కేటీయార్ విదేశాలకు వెళిపోయారు. కేసీయార్ ప్రకటించే జాబితాలో తమ పేర్లుంటాయని కేటీయార్ వర్గంలోని చాలామంది ఎదురుచూశారు.
అయితే ప్రకటించిన జాబితాలో చాలామంది పేర్లు లేవు. దాంతో దిక్కుతోచని నేతలు కేటీయార్ కు ఫోన్లు చేస్తే హైదరాబాద్ రాగానే మాట్లాడుదామని చెప్పి సముదాయించారు. అలాంటి కేటీయార్ హైదరాబాద్ కు తిరిగొచ్చిన తర్వాత కూడా ఎవరినీ కలవటానికి ఇష్టపడకపోవటంతో ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు. కేటీయార్ వైఖరితో తమకు టికెట్లు రావని కొందరు సీనియర్లు నిర్ధారణ చేసుకున్నారు. అందుకనే బీజేపీ వైపు చూస్తున్నారట. ఎందుకంటే కాంగ్రెస్ లోకి వెళ్ళినా టికెట్లు రావని అర్ధమైన వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారు. మరి బలమైన నేతలు పార్టీని వదిలేస్తే చివరకు అది అభ్యర్ధుల గెలుపుపై ప్రభావం చూపక తప్పదనే టాక్ నడుస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates