టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై వివిధ పార్టీలు స్పందించాయి. అధికార వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. శనివారం(ఈ రోజు) ఉదయం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం వైసీపీ దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందన్నారు.
జగన్ పాలనలో రెండు రకాల పాలన సాగుతోందన్నారు. అందులో ఒకటి రివర్స్ టెండెరింగ్, రెండోది రివేంజ్ పాలన చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు. ఈ దేశం, రాష్ట్రం ప్రజాస్వామ్యం అనే విషయాన్ని పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం అన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబు ను అరెస్ట్ చెయ్యడం సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణ చెప్పారు.
దారుణం: బీజేపీ
చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడాన్ని దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా.. కనీసం కేసులోనూ ఆయన ప్రమేయం ఉందనే నిర్ణారణ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఎలాంటి ప్రొసీజర్‌ను అనుసరిస్తున్నారో కూడా చెప్పకుండా అరెస్టు చేశామని చెప్పడం ఏంటని ఆమె నిలదీశారు. ఈ అరెస్టును ఖండిస్తున్నట్టు పురందేశ్వరి పేర్కొన్నారు.
నోటీసులు ఇవ్వకుండా అరెస్టులా: రామకృష్ణ
చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. ఏదైనా ఉంటే పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టవచ్చునని అన్నారు. కాని పోలీసులు అర్ధరాత్రి వెళ్లి హంగామా సృష్టించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. లోకేష్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలను నిర్బంధించటం దుర్మార్గమని పేర్కొన్నారు. జగన్ సర్కార్ ప్రతిపక్షాలను వేధించటానికి ఇది పరాకాష్టగా పేర్కొన్నారు.