తప్పు చేస్తే ఉరి తీయండి: చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే అరెస్టు చేసిన తర్వాత మీడియాతో తొలిసారిగా మాట్లాడిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో 37 ముద్దాయిగా ఉన్న తనను ఎఫ్ఐఆర్ లేకుండా, రిమాండ్ రిపోర్ట్ లేకుండా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ఈ దేశ పౌరుడిగా తనకు ఉందని, ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన మండిపడ్డారు.

ప్రైమా ఫేసీ లేకుండా అరెస్ట్ చేసేందుకు ఏ అధికారం ఉందని చంద్రబాబు నిలదీశారు. తప్పు చేసినట్టు ఆధారాలు ఉంటే తనను నడిరోడ్డుపై ఉరితీయాలని చంద్రబాబు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తనను అరెస్టు చేసేందుకు అర్ధరాత్రి పూట వందలాదిమంది పోలీసులు రావాల్సిన పని ఏంటని ప్రశ్నించారు ఇది అరాచకం కాదా అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ఖూనీ చేశారని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను అడ్డుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. తాను తప్పు చేస్తే నిరూపించాలని, ఇలా అక్రమ అరెస్టులు చేయడం సరికాదని హితవు పలికారు.

సత్యం, ధర్మం గెలుస్తాయని చంద్రబాబు అన్నారు. ప్రజలు, టిడిపి కార్యకర్తలు, టిడిపి నేతలు సంయమనం పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారం ఉంది కదా అని అరెస్టు చేశారని, సామాన్య పౌరుడిగా తనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని అన్నారు. చాలా బాధగా ఉందని, నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చంద్రబాబు అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. వీళ్ళు ఎన్ని చేసినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపనని, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని చంద్రబాబు అన్నారు.