వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని, ఏపీలో అధికారం చేపట్టాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్ర బాబు.. దానికి అనుగుణంగానే అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నారు. అదేసమయంలో ప్రజలకు ఎన్నికల వరాలు కూడా ఇస్తున్నారు. మేలో జరిగిన మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో మహిళలపై అనేక వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అక్కడితో కూడా ఆగకుండా.. తాజాగా కీలకమైన విద్యుత్ చార్జీల విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.
ప్రస్తుతం నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ విద్యుత్ చార్జీలను 12 సార్లు పెంచారని.. తమకు అధికారం ఇస్తే.. వచ్చే ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలను పెంచకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మహిళలతో ప్రజావేదిక’ కార్యక్రమంలో బాబు మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచబోమని.. సౌర, పవన విద్యుత్‌ను తీసుకొస్తామని, తద్వారా విద్యుత్ ధరలు తగ్గిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
పేదవాళ్లను ఆర్థికంగాపైకి తీసుకొచ్చి.. వాళ్లను ధనికులను చేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలోను రాష్ట్రంలోనూ ధనికులు ఎక్కువవుతున్నారని చంద్రబాబు చెప్పారు. పేదవాళ్లు మాత్రం బాగుపడట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
పేదవాళ్లందరినీ భాగస్వాములను చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజల ద్వారా సంపద సృష్టించి వారిని ధనికులను చేయాలన్నారు. అనేక ఆలోచనలు చేసి అభివృద్ధికి నాంది పలకాలని, సమర్థత పెంచడానికి, ప్రైవేటు పెట్టుబడులు తీసుకురావడానికే ఆర్థిక సంస్కరణలు వచ్చాయని వివరించారు. “డబ్బు, భూమి కాదు.. ప్రజలే నా ఆస్తి’’ అని చంద్రబాబు ప్రకటించారు.