కాంగ్రెస్ తెలంగాణ నాయకుల్లో దాదాపు కీలక నేతలంతా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా కోమటిరెడ్డితో చర్చించారు. ఇదంతా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాల గురించి జరిగిన సమావేశాలు అనుకుంటే పొరపడ్డట్లే. కాంగ్రెస్ అధిష్ఠానం మీద అలిగిన కోమటిరెడ్డిని బుజ్జగించే చర్యలివి. పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, కీలక పదవులు ఇవ్వడం లేదని కోమటిరెడ్డి మరోసారి అలక పాన్పు ఎక్కారని సమాచారం.
సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశతో ఉన్నారు. నల్గొండ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇప్పుడీ దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది. ఉన్నట్లుండి ఇప్పుడేమో కోమటిరెడ్డి మళ్లీ అలక బూనారు. రాష్ట్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీలో, సీడబ్ల్యూసీలోనూ తనకు స్థానం కల్పించకపోవడంతో కోమటిరెడ్డి అసంత్రుప్తితో ఉన్నారు. దీంతో ఆయన్ని సముదాయించేందుకు భట్టి విక్రమార్క, మాణిక్యం ఠాకూర్ కోమటిరెడ్డి నివాసానికి వెళ్లారు.
అంతే కాకుండా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోనూ కోమటిరెడ్డిని కలిపించి మాట్లాడించారు. వేణుగోపాల్ విమానాశ్రయం చేరుకునేంత వరకూ కారులో కోమటిరెడ్డితో మాట్లాడారు. దీంతో కోమటిరెడ్డి ఆవేదనను అర్థం చేసుకున్న వేణుగోపాల్.. త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కానీ అసెంబ్లీ టికెట్పై మాత్రం స్పష్టత రాలేదని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసమే కోమటిరెడ్డి ఇవన్నీ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అసలు విషయం పక్కకుపెట్టి.. ఇతర వాటిపై కోమటిరెడ్డికి హామీ లభించిందని చెబుతున్నారు. మరి టికెట్ దక్కేంత వరకూ కోమటిరెడ్డి అలక ఇలాగే కొనసాగుతుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.