రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న నేతలు ఎంత స్ధాయి వారైనా సరే దరఖాస్తు చేసుకోవాల్సిందే అని బీజేపీ అధిష్టానం ముందే స్పష్టం చేసింది. దీని ప్రకారమే తెలంగాణా బీజేపీ 2వ తేదీనుండి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ మొదలుపెట్టింది. అంటే ఇప్పటికి నాలుగురోజుల నుండి తీసుకుంటున్న దరఖాస్తులు సుమారు 750 దాటాయి. దరఖాస్తు చేసుకోవటానికి ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ఎంతమందైనా దరఖాస్తులు చేయవచ్చు. ఈ పద్దతిలోనే వందలాది దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం.
దరఖాస్తులు వస్తున్న విషయాన్ని, తీసుకుని ప్రాసెస్ చేస్తున్న విషయాన్ని పార్టీలో కీలక నేత ప్రకాష్ జవదేకర్ స్వయంగా పరిశీలించారు. అంతాబాగానే ఉంది కానీ ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో ప్రముఖ నేతల నుండి దరఖాస్తులు రాలేదు. 10వ తేదీతో ముగియబోయే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో వెయ్యికిపైగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు. ఇదే సమమంలో ప్రముఖుల నుండి ఒక్క దరఖాస్తు కూడా రాలేదట.
అంబర్ పేట నుండి కిషన్ రెడ్డి, ముషీరాబాద్ నుండి లక్ష్మణ్, గద్వాల నుండి డీకే అరుణ, హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్, ఆర్మూర్ నుండి ధర్మపురి అర్వింద్, దుబ్బాక నుండి రఘునందనరావు, చెన్నూరులో మాజీ ఎంపీ వివేక్, మహబూబ్ నగర్ నుండి జితేందర్ రెడ్డి పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే వీరిలో ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఇక విజయశాంతి, మురళీధరరావు, గరికపాటి మోహనరావు, చాడ సురేష్ రెడ్డి, బూరనర్సయ్య గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నుండి ఎలాంటి సంకేతాలు లేవు.
వీళ్ళు ఏ నియోజకవర్గం నుండి పోటీచేస్తారు ? అసలు బీజేపీలో ఉంటారా ఉండరా అన్నది కూడా అయోమయంగానే ఉంది. అందుకనే పార్టీ క్యాడర్లో కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉంది వీళ్ళ దరఖాస్తుల విషయంలో. అలాగే కరీనంగర్ ఎంపీ బండి సంజయ్ విషయం కూడా ఏమీ తేలలేదు. ఎందుకంటే దరఖాస్తు ఇవ్వటానికి 10వ తేదీ ఆఖరు. అయితే బండేమో అమెరికాలో ఉన్నారు. హైదరాబాద్ కు 12వ తేదీన కానీ తిరిగిరారు. బండి విషయం సస్పెన్సుగా తయారైంది. బహుశా సీనియర్ల నుండి 9,10 తేదీల్లో దరఖాస్తులు రావచ్చని అనుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates