ఆ హీరోని చెప్పుతో కొడితే 10 లక్షలు

సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఉదయినిది స్టాలిన్ తల నరికి తెచ్చిన వారికి 10 కోట్ల నజరానా ఇస్తానని అయోధ్యకు చెందిన పూజారి ఒకరు ప్రకటించగా ఉదయనిధి తలపై కోటి రూపాయల నజరానాను తెలంగాణకు చెందిన బీజేపీ నేత ఒకరు ప్రకటించారు. ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై ప్రధాని మోడీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, ఆ వ్యాఖ్యలను దీటుగా తిప్పికొట్టాలని కేంద్ర మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉదయనిది స్టాలిన్ ను చెప్పుతో కొట్టిన వారికి 10 లక్షల నగదు బహుమతిని ఇస్తామని హిందూ సంస్థ అయినా జన జాగరణ సమితి సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకారం విజయవాడలో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి.

ఓ వైపు ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే డీఎంకే నేత, ఎంపీ ఏ.రాజా సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మలేరియా, డెంగ్యూ వంటి వాటిని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ మృదువుగా చెప్పారని, నిజానికి అవి హెచ్ఐవి, కుష్టు వ్యాధి వంటివని రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, ఆ వ్యాధులకు సామాజిక కళంకం లేదని, కానీ వాటిని అసహ్యంగా చూస్తారని, సనాతన ధర్మం అంతకంటే ఎక్కువ అని రాజా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మానికి ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన విశ్వకర్మ యోజన పథకానికి రాజా లింకు పెట్టారు.

అవి రెండూ ఒకటేనని ఆరోపించారు. ఇక, తన వ్యాఖ్యలపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని, తన తలకు కోటి రూపాయల నజరానా ప్రకటించినా తనకు అభ్యంతరం లేదని రాజా సవాల్ విసిరారు. ఆయుధాలతో వచ్చినా, లేకుండా వచ్చినా, ఢిల్లీలో అయినా, ఎక్కడైనా…అంబేద్కర్, పెరియార్ పుస్తకాలతో వస్తానని రాజా ఛాలెంజ్ చేశారు. ఇక, తన తనయుడు ఉదయనిది వ్యాఖ్యలను ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వెనకేసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ మహిళలకు సనాతన ధర్మం వ్యతిరేకమని ఉదయనిధి అన్నారని, ఆ వ్యాఖ్యలలో తప్పేమీ లేదని స్టాలిన్ అన్నారు. అదే సమయంలో తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని చెప్పారు.