కర్రలు ఇచ్చాకే చిరుతలు దొరికాయట

తిరుమల కాలినడకన వెళుతున్న చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత చిరుతలను పట్టుకునేందుకు టీటీడీ, అటవీ శాఖా సిబ్బంది పలు చర్యలు చేపట్టారు. ట్రాప్ కెమెరాల ఏర్పాటు చేసి చిరుత కదలికలను పసిగట్టారు. ఈ క్రమంలోనే చిరుతలను భయపెట్టేందుకు భక్తులకు కర్రలు ఇచ్చిన వ్యవహారం నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ట్రోలింగ్ జరిగింది. అయినా సరే తన కర్రల వ్యవహారంపై భూమన తగ్గేదేలే అంటున్నారు. తాజాగా మరో చిరుత బోనులో చిక్కుకున్న సందర్భంగా భూమన చేసిన కామెంట్లు మరోసారి ట్రోలింగ్ కు గురవుతున్నాయి.

తాజాగా 7వ మైలు- నరసింహ స్వామి ఆలయం మధ్యలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత పట్టుబడింది. గత 75 రోజుల వ్యవధిలో 5వ చిరుత పట్టుబడింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కరుణాకర్ రెడ్డి మరోసారి కర్రలపై స్పీచ్ దంచికొట్టారు. తాము కర్రలు ఇచ్చిన తర్వాతే చిరుతలు బోన్లలో చిక్కుతున్నాయని భూమన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. వినరో భాగ్యము భూమన ‘కర్ర’ కథ! అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు,భద్రతా సిబ్బందిని భక్తులకు తోడుగా పంపుతున్నామని, ఎక్కడా ఇబ్బంది లేకుండా యాత్రికులకు అదనంగా కర్రలిస్తామని చెప్పామని, అంతేగానీ, కర్రలిచ్చి మా పని అయిపోయింది అని చెప్పలేదని భూమన అన్నారు.

భక్తుల భద్రతపై బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని, 200 మంది అటవీ సిబ్బంది..అధునాతన బోన్లు…నిరంతరం పర్యవేక్షణ జరుగుతున్నాయని అన్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా బాధ్యతగా టీటీడీ ఈవో నేతృత్వంలో పనిచేస్తున్నారని చెప్పారు. తమను విమర్శించి బూతులు మాట్లాడేవారికి కూడా ఇదే చెబుతున్నామని, యాత్రికుల భద్రతపై రాజీ పడబోమని అన్నారు.

ఇక, తమ ప్రయత్నాలతో కాలినడక మార్గంలో చిరుత, జంతువుల సంచారం తగ్గిందని డీఎఫ్ వో చెబుతున్నారు. ఈ చిరుతను ఎస్వీ జూ పార్క్ కు తరలించి క్వారంటైన్ లో పెడుతామన్నారు. ముంబైలోని ల్యాబ్ కు ఈ చిరుతకు సంబంధించిన శాంపిల్స్ పంపారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత లక్షితపై దాడి చేసిన చిరుతను జూలో ఉంచి…మిగిలిన వాటిని అడవిలోకి వదిలేస్తామన్నారు. లక్షిత పై దాడి చేసిన చిరుత ఏది అన్నది తేలాల్సి ఉంది.