“ఏపీ సీఎం జగన్ గురించి నేను ఎక్కడ మాట్లాడినా నిజాలే చెబుతున్నా. కోర్టులు, సీబీఐ ఆఫీసర్లు చెప్పిన విషయాలనే చెబుతున్నా. అవి తప్పెలా అవుతాయి?” అని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పరిధిలోని బేతపూడి లో ఉన్న నారా లోకేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం జగన్ సహా.. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిలను కించపరిచేలా మాట్లాడారని, దీనికి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాదయాత్ర సాగుతున్న దారిలో టీడీపీ నాయకులను కించపరిచేలా ఫ్లెక్సీలు పెట్టారని, పోలీసులు వాటిని ఎలా అనుమతించా రని ప్రశ్నించారు. తాడేరు వద్ద వైసీపీ శ్రేణులే పాదయాత్రపై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పాద యాత్రలో శాంతిభద్రతలకు తానెక్కడా విఘాతం కలిగించలేదని చెప్పారు.
“సీమతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పాదయాత్ర చేశాను. ఎక్కడా జరగని గొడవలు భీమవరంలోనే జరుగుతున్నాయి. రెచ్చగొట్టేలా నేను ఏం వ్యాఖ్యలు చేశానో చెప్పాలి. ఏ పదాలు కించపరిచేలా ఉన్నాయో సీఎం జగన్‌ను చెప్పమనండి. ఆయనకు రూ.లక్షకోట్ల ఆస్తి ఉంది. రూ.12 కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. ఇవే విషయాలు మేం చెప్తే తప్పేంటి? కడప ఎంపీని ఏ9గా సీబీఐ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. అదే ప్రజలకు చెబుతున్నాం. దీనిలో తప్పేంటి” అని నారా లోకేష్ పోలీసులను ప్రశ్నించారు.