విజయవాడ మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నాయకుడు లగడపాటి రాజగోపాల్ గురించి రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ అందరికీ తెలిసిందే. తెలంగాణ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి అప్పట్లో హల్చల్ చేసిన నాయకు డిగానే కాకుండా పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లి స్పీకర్ సహా సభ్యులను పరుగులు పెట్టించి సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ… 2014 రాష్ట్ర విభజన తర్వాత నుంచి పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రు.
2004, 2009 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న లగడపాటి అనతి కాలంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇదిలావుంటే, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నప్పటికీ.. పరోక్షంగా ఎన్నికల సమయంలో మాత్రం పార్టీల జాతకాలు చెబుతున్నారు. ముందస్తు సర్వేల పేరుతో ఆయన ఎన్నికలకు ముందు కొన్ని సర్వేలు ప్రకటించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత ఆయన చెప్పిన జోస్యం విఫలమైంది.
ఏపీలో జగన్ ఎట్టిపరిస్థితిలోనూ అధికారంలోకి రాడని.. అలా వస్తే.. తాను ఇక, సర్వేల నుంచికూడా తప్పు కొంటానని ప్రకటించారు. అనుకున్నట్టుగానే జగన్ అధికారంలోకి వచ్చాక.. లగడపాటి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. కట్ చేస్తే.. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోసారి విజయవా డ రాజకీయాల్లో లగడపాటి పేరు ప్రముఖంగా తెరమీదికి వచ్చింది. త్వరలోనే ఆయన రాజకీయ అరంగే ట్రం చేస్తున్నారని.. దీనికి సంబంధించి చర్చలు సాగుతున్నాయని సమాచారం.
2024 ఎన్నికల్లో మళ్లీ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని కొందరు పారిశ్రామిక వేత్తలు, మరికొందరు మిత్రులు కూడా భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఒక హోటల్‌లో కొందరు రహస్య సమాలోచనలు చేసినట్టు సమాచారం. అయితే.. గత ఏడాది కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. లగడపాటి మరోసారి రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే, అప్పట్లో ఆయన ఈ వార్తలను ఖండించారు. తనకు ఇంట్రస్ట్ లేదన్నారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన కూడా తన మనసు మార్చుకున్నారేమో.. చూడాలి. మొత్తానికి లగడపాటి రీ ఎంట్రీ కనుక ఇస్తే.. విజయవాడ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.