రజనీకాంత్ కు గవర్నర్ పదవి..క్లారిటీ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆధ్యాత్మిక భావాలు, భక్తి ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు రజనీకాంత్ పాదాభివందనం చేయడం కూడా వివాదాస్పదమైంది. అయితే, ముఖ్యమంత్రిగా ఆయనకు పాదాభివందనం చేయలేదని, ఒక యోగిగా మాత్రమే ఆయనకు పాదాభివందనం చేశానని తలైవా క్లారిటీనిచ్చారు. ఏదేమైనా, రజినీకాంత్ బిజెపి మద్దతుదారుడు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, బిజెపి తరఫున గవర్నర్ గా రజనీకాంత్ ను త్వరలోనే నియమించబోతున్నారంటూ చాలాకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇక, తలైవాకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు మోడీ రెడీ అని, కానీ అమిత్ షా మాత్రం ఒప్పుకోవడం లేదని రకరకాల పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇటీవల ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో తలైవా సమావేశం కావడం, మాజీ సీఎం పన్నీర్ సెల్వాన్ని కలవడం నేపథ్యంలో ఈ పుకార్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆ పుకార్లకు ఊతమిచ్చేలా ఉన్నాయి. రజనీకాంత్ కు గవర్నర్ పదవి దక్కడం దేవుడి చేతిలో ఉందంటూ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని సత్యనారాయణ తేల్చి చెప్పారు. కానీ, గవర్నర్ పదవిపై రజనీకాంత్కు ఆశ లేదని, అవి పుకార్లని మాత్రం అనలేదు. ఇక, పనీర్ సెల్వంతో రజనీ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని సత్యనారాయణ అన్నారు. అరోగ్యం రీత్యా, ఇతర కారణాల రీత్యా ప్రత్యక్ష రాజకీయాలపై రజనీ ఆసక్తి చూపని నేపథ్యంలో గౌరవప్రదంగా గవర్నర్ పదవి తీసుకుంటారేమో అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పదవిపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సత్యనారాయణ ఖండించకపోవడం విశేషం.