టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 118 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారంటూ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారం ఇంగ్లీష్ పత్రికలలో కథనాలు కూడా వచ్చాయని, ఈ వ్యవహారంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక బ్యాక్ డోర్ పొలిటిషన్ అని, అవినీతి పునాదులపైనే నారావారిపల్లె నుంచి జూబ్లీహిల్స్ వరకు భవంతులు నిర్మించుకున్నారని ఆరోపించారు. ఐటీ శాఖ ఆరోపణలపై చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
అన్నా హజారే అనుచరుడిని, గాంధీజీ తమ్ముడిని అని చెప్పుకునే చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆ ముడుపుల వ్యవహారంలో ఐటీ శాఖ తీగలాగితే చంద్రబాబు డొంక కదలడం ఖాయమని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఐటీ శాఖ 46 పేజీల షోకాజ్ నోటీసులు ఇస్తే వాటిని తీసుకునేందుకు చంద్రబాబు ఎందుకు నిరాకరించారని నిలదీశారు. అమరావతిలో దొంగతనం చేసిన చంద్రబాబు జ్యురిస్ డిక్షన్ కాదంటూ ఐటీ శాఖతో వితండవాదం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ముడుపుల వ్యవహారంలో కోట్ల రూపాయలు అంటే అందరికీ అర్థం అవుతుందని, టన్నులు అనే కోడ్ లాంగ్వేజ్ ను వాడారని అమర్నాథ్ ఆరోపించారు.
చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు కూడా ఐటీ జాబితాలో ఉందంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ అని, అన్ స్కిల్డ్ పొలిటిషన్ అని ఎద్దేవా చేశారు. తుప్పు పట్టిన చంద్రబాబు నిప్పు అంటే ప్రజలు నమ్మరని, ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. సీమెన్స్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీని సైతం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోకి లాగిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రజా కోర్టులోకి ఈడుస్తామని, అక్కడ ఆయన సమాధానం చెప్పి తీరాలని అన్నారు. ఈ గోల్ మాల్ లో విదేశీ నిధులు కూడా ఉన్నాయి కాబట్టి ఈడీ రంగంలోకి దిగి కేడీని పట్టుకోవాలని అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.