అధికారం కాంగ్రెస్ దేనా ?

తెలంగాణా ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం మాత్రం కాంగ్రెస్ దే అని హస్తంపార్టీ నేతలు చాలా బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతు 38 శాతం ఓటు షేరుతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నట్లు జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఓటుషేర్ 31 మాత్రమే అన్నారు. బీజేపీ గురించి జనాలు ఎవరు అసలు ఆలోచించటమే లేదని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ పనే అయిపోయిందని అనుకున్న తర్వాత ఇక బీజేపీగురించి ఆలోచించేదెవరు ? అన్నది రేవంత్ లాజిక్.

జనాలందరు బీఆర్ఎస్-బీజేపీ ఒకటే అని అనుకుంటున్నారని బల్లగుద్ది మరీ చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్-బీజేపీ పార్టీలను కలిపిందని చెప్పారు. ఇపుడు జమిలి ఎన్నికల ప్రస్తావన, సంకేతాలంతా ఉత్త హడావుడి మాత్రమే అన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదన్నారు. జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే రాజ్యాంగపరమైన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. ఈ సమస్యలను ఒక్కోదాన్ని విప్పుకుంటు వెళ్ళి వాటికి పరిష్కారాలను కనుక్కుని ఎన్నికలు నిర్వహించటంటే చిన్న విషయం కాదన్నారు.

నరేంద్రమోడీ జమిలి ఎన్నికల జపం చేస్తున్నది ఓటమిభయంతోనే అని స్పష్టంగా చెప్పారు. మోడీ ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలకు కేసీయార్ పూర్తి సహకారం అందిస్తారనటంలో సందేహంలేదన్నారు. గతంలోనే జమిలి ఎన్నికలను కేసీయార్ ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు. జమిలికి బీఆర్ఎస్ మద్దతిస్తు కేంద్రానికి రాసిన లేఖను రేవంత్ మీడియాకు విడుదలచేశారు. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కాబట్టే బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు పార్టీలు కాదు ఒకటే అని తాము చెబుతున్నట్లు రేవంత్ చెప్పారు.

ఇప్పటివరకు తెలంగాణాలో జరిగిన సర్వేలన్నీ కాంగ్రెస్ దే అధికారం అని తేల్చిన విషయాన్ని గుర్తుచేశారు. సీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్ 38 శాతం, బీఆర్ఎస్ కు 31 శాతం ఓటు షేర్ ఉందని స్పష్టంగా తేలిందన్నారు. తొందరలో జరగబోయే ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమిభయం తప్పదనే మోడీ జమిలి ఎన్నికల జపం చేస్తున్నారని అందుకు కేసీయార్ కూడా మద్దతుగా నిలబడుతున్నట్లు రేవంత్ మండిపోయారు. కేసీయార్ లో కూడా ఓటమిభయం కనబడుతోందని రేవంత్ అభిప్రాయపడ్డారు.