వైసీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత, మంత్రి రోజా…ప్రతిపక్ష నేతలపై దూకుడుగా మాటలదాడి చేస్తారన్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన నేతలపై సందర్భానుసారంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు రోజా. ఇలా ప్రతిపక్ష పార్టీల నేతలపై మాటలు తూటాలు పేల్చే రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ చాలాకాలంగా తగులుతోంది. నగరిలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతి…రోజాకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, మంత్రి పెద్దిరెడ్డితో పాటు నారాయణస్వామితో కూడా రోజాకు పెద్దగా పొసగడం లేదు అన్న టాక్ నగరి వైసీపీ నేతలలో ఉంది.
అయితే, గత రెండు పర్యాయాలు రోజాను గెలిపించేందుకు కృషిచేసిన నియోజకవర్గ స్థాయి నేతలు ఈ సారి తిరుగుబాటు చేయడంతో ఫైర్ బ్రాండ్ సైలెంట్ కావాల్సి వచ్చింది. నగరిలో కేజే శాంతి, పుత్తూరులో అమ్ములు, నిండ్రలో చక్రపాణి రెడ్డి, విజయపురంలో రాజు, వడమాలపేటలో మురళి రెడ్డి వంటి నేతలు మంత్రి రోజాపై అసమ్మతి గళం వినిపిస్తుండటంతో వైసీపీ అధిష్టానం కూడా ఇరకాటంలో పడింది. నగరిలో రోజా కుటుంబ సభ్యుల ప్రమేయం బాగా ఎక్కువైందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే, తాము రోజాకు వ్యతిరేకంగా మారామని చెబుతున్నారు. అయితే, అసమ్మతి నేతలకు సహకరిస్తే సస్పెండ్ చేస్తామని పార్టీ అధిష్టానం బెదిరించినా వారి వైఖరిలో పెద్దగా మార్పు రాలేదు.
ఇటీవల నగరిలో జగన్ పర్యటన సందర్భంగా కూడా ఈ అంతర్గత విభేదాలు రోడ్డుకెక్కాయి. నగరిలో జగన్ కు స్వాగతం చెబుతూ కట్టిన భారీ ఫ్లెక్సీలలో మంత్రి రోజా ఫోటో లేకపోవడంతో ఈ విషయం బట్టబయలైంది. అదే ఫ్లెక్సీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో ఉండడం రోజాకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. మంత్రి రోజా ఆధ్వర్యంలోనే ఈ సభ జరగడంతో ఐదు మండలాల వైసిపి ఇన్చార్జిలు జన సమీకరణకు దూరంగా కూడా ఉన్నారట. దీంతో, జన సమీకరణకు కూడా రోజానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందట.
సాక్షాత్తు జగన్…కేజే శాంతి, రోజాలు కలిసి పనిచేయాలని సూచించినా వారిద్దరూ ఎడమొఖం పెడమొఖంగా ఉండటం సంచలనం రేపింది. ఇద్దరు చేతులను పట్టుకొని జగన్ కలిపే ప్రయత్నం చేయగా…బలవంతంగా షేక్ హ్యాండ్ ఇచ్చి…చేతులు దులుపుకున్నారు ఆ ఇద్దరు నేతలు. దీంతో, నగరిలో ఈ ఇద్దరు మహిళల మధ్య వార్ ఏ స్థాయిలో ఉందో జగన్ కు కూడా ప్రత్యక్షంగా అర్థమైంది. నగరి పర్యటన సందర్భంగా ఈ నేతల మధ్య జగన్ రాజీ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే, ఆయనకే సాధ్యం కాకపోవడంతో ఇరు వర్గాలలోని కేడర్ అయోమయంలో పడ్డారట.
జగన్ పర్యటించిన కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరోసారి గెలిపించాలని చెబుతూ వస్తున్న నేపథ్యంలో నగరిలో మాత్రం రోజా పేరు గాని, ఆ ప్రస్తావన గాని తేకపోవడం రోజా వర్గాన్ని ఆలోచనలో పడేసిందట. దీంతో, రాబోయే ఎన్నికలలో రోజాకు టికెట్ ఇస్తారా లేక ఎమ్మెల్సీ కోటాలో సర్దుబాటు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates