రాజకీయ నేతలు ఎప్పుడు తడబడి మాట్లాడతారా.. ఎప్పుడు ట్రోలింగ్ చేద్దామా అని కొందరు కాచుకుని ఉంటారు. వారికి దొరికిపోయింది.. వైఎస్సార్ టీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఆమె గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. అసలు విషయం ఏమిటంటే.. భేటీ అనంతరం బయటకు వచ్చిన షర్మిల విలేకరులతో మాట్లాడుతూ సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని తాను కలిసినట్లు చెప్పారు. ఇక్కడే ఆమె ట్రోలర్స్‌కు దొరికి పోయారు. వారంతో నెట్టింట్లో ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
ఇందిరాగాంధీతో కుదరలేదా తల్లీ.. అని ఒకరు సరదాగా ట్విట్టర్‌లో పశ్నిస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానంద రెడ్డి అందుబాటులో లేక కలవలేక పోవచ్చంటూ మరొకరు ట్వీట్ చేశారు. మా అక్కకి సంతోషం ఎక్కువ అంటూ ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఇక మీమ్స్‌కైతే లెక్కేలేదు. గతంలోనూ రేవంత్‌రెడ్డి పాదయాత్రపై షర్మిల చేసిన వ్యాఖ్యలను తీసుకుని ఇన్‌స్టాలో ఔత్సాహికులు వందలకొద్దీ రీల్స్ చేశారు. ఇప్పుడు ఇలా దొరికిపోయారు. రాహుల్‌కు బదులుగా.. రాజీవ్ అని అన్నా.. ఈ ట్రోలర్స్ ఆగరు కదా మరి.